ఈ మధ్య కురుస్తున్న అకాల వర్షాల వల్ల కేవలం పంట నష్టమే కాకుండ ప్రాణ నష్టం కూడా జరిగింది. రైతులతో పాటు మృతి చెందిన బాధిత కుటుంబాలుతీవ్ర ఆందోళనకు గురయ్యాయి. పంట చేతికొచ్చిన సమయంలో రైతులు.. ఇంటి పెద్దని పోగొట్టుకుని కుటుంబ సభ్యుల భాద చెప్పలేనటువంటిది. ఈ సంఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డలో చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా హడావిడిగా మారింది. మధ్యాహ్నం కల్లా వర్షం విరుచుకుపడింది. అప్పటికప్పుడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం భారీగా పడింది. పంటలన్నీ నీళ్లపాలయ్యాయి. పిడుగులు కూడా విరుచుకుపడ్డాయి. ఓవైపు వర్షం.. మరోవైపు పిడుగుల శబ్ధంతో ప్రజలు బిక్కుబిక్కుమని పోయారు.
మరోవైపు అవనిగడ్డ దగ్గర ఓ రైతు పొలం పనులు చేస్తుండగా పిడుగు పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే కన్నుమూశారు. చల్లపల్లిలో పిడుగుల శబ్ధంతో ఇద్దరికి గుండెపోటు వచ్చింది. వారిద్దరిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచారు. దీంతో ఈ ముగ్గురి కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. గుంటూరు జిల్లాలోనూ అకాల వర్షం ప్రాణాలు తీసుకుంది. పత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పిడుగుపాటుకు శ్యాంబాబు, కృపానందం ప్రాణాలు విడిచారు. ఆరబోసిన మిర్చిపంట కుప్పలపై పట్టలు కప్పుతుండగా పిడుగుపడింది. దీంతో శ్యాంబాబు, కృపానందం మరణించారు.