తెలంగాణ, ఏపీతోపాటు తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలు టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలని కోరుతూ ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాసినట్టు సమాచారం.
ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ ఇప్పుడు ఎన్ని ఉపద్రవాలను తెచ్చి పెడుతుందో అందరికీ తెలిసిందే. ప్రభుత్వ కార్యాలయాల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాల్సిన ఉద్యోగులు టిక్‌టాక్ మోజులో పడి సస్పెండ్‌కు గురవుతున్నారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలోని అనేక రాష్ట్రాల్లో పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉందట. దీంతో టిక్‌టాక్ యాప్‌ను ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి నిషేధించాలనే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నట్లు సమాచారం.
యాప్‌లో కొందరు యూజర్లు పెడుతున్న అసభ్యకరమైన వీడియోల వల్ల యువత, పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారనే కారణాలతో గతంలో మద్రాస్ హైకోర్టు టిక్‌టాక్ యాప్‌ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. అందులో భాగంగానే ఈ యాప్‌పై డెవలపర్లు సుప్రీం కోర్టు దాకా వెళ్లి ఎలాగో కష్టపడి నిషేధాన్ని ఎత్తేసేలా చేసుకున్నారు. దీంతో టిక్‌టాక్ యాప్ మళ్లీ వాడుకలోకి వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం ఈ యాప్‌ను ఎట్టి పరిస్థితిలోనూ నిషేధించాలని ఆయా రాష్ట్రాలు ముక్త కంఠంతో కేంద్రాన్ని కోరుతున్నాయట.
తెలంగాణ, ఏపీతోపాటు తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలు టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలని కోరుతూ ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాసినట్టు సమాచారం. దీనిపై స్పందించిన కేంద్రం 24 ప్రశ్నలతో కూడిన నోటీసులను ఆ యాప్‌కు చెందిన నిర్వాహకులకు జారీ చేసిందట. ఆ ప్రశ్నలకు టిక్‌టాక్ డెవలపర్లు సరైన సమాధానం ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం ఆ నోటీసుల్లో హెచ్చరించిందట. దీంతో టిక్‌టాక్ నిర్వాహకులు మరోసారి తలలు పట్టుకుని కూర్చున్నట్లు తెలిసింది. మరి దీనిపై స్పష్టత రావాలంటే మరికొద్ది రోజుల పాటు వేచి చూడక తప్పదు..!