బార్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ పాల్ విల్సన్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. టిమ్ పైన్ ను నాటౌట్‌గా ప్రకటించడంపై ఇండియన్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. మ్యాచ్ లో అంపైర్ తీసుకున్న నిర్ణయంపై వారు మండిపడుతున్నారు.
బార్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో భాగంగా 2వ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 55వ ఓవర్‌లో ఆ జట్టు కెప్టెన్ టిమ్ పైన్, కేమరాన్ గ్రీన్‌లు ఓ బంతికి పరుగులు తీసేందుకు కష్టపడ్డారు. ఈ క్రమంలో టిమ్ పైన్ స్ట్రైకర్ ఎండ్‌కు చేరుకోవడంలో కొంత వెనుక బడ్డాడు. ఉమేష్ యాదవ్ బంతిని వికెట్ కీపర్ పంత్‌కు విసరగా పంత్ వికెట్లను గిరాటేశాడు. అయితే రీప్లే కోసం థర్డ్ అంపైర్‌కు ఇవ్వగా నాటౌట్ అని పాల్ విల్సన్ ప్రకటించాడు.
అయితే ఆఫ్ సైడ్ కెమెరా యాంగిల్ నుంచి చూస్తే టిమ్ పైన్ బ్యాట్ క్రీజు దాటి లోపలికి రాలేదని లైన్ మీదే బ్యాట్ ఉందని స్పష్టంగా తెలుస్తుంది. దీంతో అతన్ని కచ్చితంగా ఔట్ ఇవ్వాల్సిందే. కానీ అతన్ని నాటౌట్‌గా ప్రకటించారు. ఈ క్రమంలో ఈ విషయంపై ఇండియన్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు కామెంటరీ చెబుతున్న మాజీలు కూడా టిమ్ పైన్ ను ఔట్ గా ప్రకటించాల్సిందని, అతను తనంతట తానుగా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందని చెప్పడం విశేషం.
అయితే పైన్‌ను నాటౌట్‌గా ప్రకటించినా అతను ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఆసీస్ ఇన్నింగ్స్ 63వ ఓవర్‌లో 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కాగా భారత్ రెండో టెస్టులో అద్భుతమైన ప్రదర్శన ఇస్తోంది. ఆసీస్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే కట్టడి చేస్తోంది.