భారత బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ అమెరికా దేశానికి కోవాగ్జిన్ టీకాను అందించనుంది. కోవిడ్-19ను నిర్మూలించడానికి భారత్ కు చెందిన టీకా సమర్థవంతంగా పనిచేస్తుండటంతో ఈ టీకాపై నమ్మకం పెరిగింది. ఇప్పటికే చాలా దేశాలు కోవిగ్జిన్ టీకా కోసం క్యూ కడుతున్నాయి. ఈ మేరకు అమెరికా ‘నాస్ డాక్’ సంస్థ కింద నమోదైన ఆక్యుజెన్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకుంది. టీకా పంపిణీ విషయంలో ఆక్యుజెన్ సంస్థతో కలిసి పని చేస్తున్నట్లు భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది.
ఈ ఒప్పందం ప్రకారం ఆక్యుజెన్ సంస్థ యూఎస్ లో ‘కోవాగ్జిన్’ టీకాపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనుంది. యూఎస్-బయోలాజిక్స్ లైసెన్స్ అప్లికేషన్ తో అనుమతులు తీసుకుని విక్రయాలు చేపట్టాల్సి ఉంది. మొదటిదశలో కోవాగ్జిన్ టీకాను భారత బయోటిక్ పంపిణీ చేయనుంది. ఈ తర్వాత టీకా తయారీ కోసం ఆక్యుజెన్ సంస్థకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనుంది. దీంతో ఆక్సుజెన్ సంస్థ అమెరికాలోనే కోవాగ్జిన్ టీకాను తయారు చేయగలదు.
అమెరికాలో కోవాగ్జిన్ టీకాపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు, తయారు చేయడానికి ఆక్సుజెన్ శాస్త్రవేత్తలు ఇప్పటికే అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ, బయో మెడికల్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ అథారిటీతో సంప్రదింపులు కూడా జరుపుతోంది. కోవాగ్జిన్ సరఫరాపై ఆమోదం లభించినట్లయితే ఆక్యుజెన్ సంస్థ అధిక సంఖ్యలో టీకాలను సరఫరా చేయనుంది. అమెరికాలో కోవాగ్జిన్ టీకా పంపిణీలో వచ్చిన లాభాల్లో ఆక్సుజెన్ 45 శాతం వాటా తీసుకోగా.. మిగిలినది భారత్ బయోటెక్ కు అందించనుంది.
బ్రిటన్ లో కొత్తరకం కరోనా వైరస్ తో కూడా కోవాగ్జిన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పోరాడుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఈ టీకా అన్ని వయసుల వారిపై పని చేస్తుందని.. కేవలం 2-8 డిగ్రీల ఉష్ణోగ్రతలో టీకాను నిల్వ చేస్తే సరిపోతుందని ఆక్సుజెన్ చైర్మన్ డాక్టర్ శంకర్ ముసునూరి తెలిపారు. ఎన్నో రకాల వైరస్ పై కూడా కోవాగ్జిన్ పనిచేస్తుందని, ఈ టీకా ఎంతో భద్రమైనదని భారత బయోటెక్ ఇంటర్నేషనల్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల వెల్లడించారు.