అమరావతి : ఏపీ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది అధికార వైసీపీ పార్టీ. నాగార్జున యూనివర్సిటీలో రెండు రోజుల పాటు వైసీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ నిర్వహించనుంది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. ఈ మేరకు జాబ్ మేళను వైసీపీ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ విజయ సాయిరెడ్డి పర్యవేక్షించారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు జాబ్ మేళ ఉంటుందని విజయ సాయిరెడ్డి ప్రకటన చేశారు.
ఇప్పటి వరకు జరిగిన రెండు జాబ్ మేళాల్లో 347 కంపెనీలు పాల్గొన్నాయని.. సుమారు 30 వేలు పై చిలుకు నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారని గుర్తు చేశారు. ఇవాళ్టి నుంచి జరిగే జాబ్ మేళలో 210 కంపెనీలు పాల్గొంటున్నాయని.. ఈ కంపెనీల్లో 26, 289 ఖాళీలు ఉన్నాయని స్పష్టం చేశారు.
వైఎస్సార్‌సీపీ జాబ్ మేళా వెబ్ సైట్ లో 97 వేల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారన్నారు. హెల్త్ కేర్, మార్కెటింగ్, సేల్స్, ఎడ్యుకేషన్ సెక్టార్, రియల్ ఎస్టేట్ వంటి రంగాలకు చెందిన కంపెనీలు ఉన్నాయని.. ప్రధాన గేట్ దగ్గర ఉండే క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసుకుంటే అన్ని వివరాలు కనిపిస్తాయని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని కోరారు విజయసాయిరెడ్డి.