ఎన్టీఆర్ తో నేను : అన్న గారి ఆద‌ర‌ణ ఆచ‌ర‌ణ అపూర్వం !

-

విస్తారం అయిన జీవితాన కొంద‌రే తార ప‌థాన ఉంటారు. జ్ఞ‌ప్తికి వ‌స్తారు. జ్ఞాప‌కాల వ‌నాన ప‌రిమ‌ళించే వ‌రం ఎన్టీఆర్.. ఆ ఆక‌ర్ష‌ణ శ‌క్తి అపూర్వం. ఆ.. న‌ట‌నా కౌశ‌ల యుక్తి అనిర్వ‌చ‌నీయం. తెలుగు భాష కు వ‌న్నెల‌ద్దిన సినిమాలు మ‌రియు సంభాష‌ణ‌లు నంద‌మూరి తార‌క రామారావు అనే ఓ పూర్తి పేరుతోనే ఓ చరిత్ర లిఖితం. ఆ క‌థలో భాగంగా భాగ్య న‌గ‌రి కేంద్రంగా ప‌నిచేసే ప్ర‌ముఖ చిత్ర‌కారులు దాకోజు శివ‌ప్ర‌సాద్ ..సోష‌ల్ మీడియా వేదిక‌గా..కొన్ని విశేషాలు అందిస్తున్నారు. ఆ వివ‌రం ఆయ‌న మాటల్లోనే..

అవి సామ్రాట్ అశోక సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులు. రేపు మీరు మన స్టూడియోకి రావాలి బ్రదర్ అన్నారు ఎన్టీఆర్. ఎందుకండీ అన్నాను. సాంగ్ షూట్ చేస్తున్నాం. మీరు స్కెచెస్ వేస్తే ఆ ప్రకారం..స్టిల్స్ తీయించి, ప్రెస్ కి రిలీజ్ చెయ్యాలి అన్నారు. సరేనండీ అన్నాను. సార్వభౌముల ఆజ్ఞ ప్రకారం మరుసటి రోజు ఉదయం..నాచారం రామకృష్ణా సినీ స్టూడియోలో ఉన్నాను. కళ్ళు మిరుమిట్లు గొలిపే అలంకరణతో హీరో ఎన్టీఆర్, హీరోయిన్ వాణీ విశ్వనాథ్ మెరిసిపోతున్నారు. కించిత్ కించిత్ కిలికించితం అనే పాటకి అనుగుణంగా అభినయిస్తున్నారు.

బ్రేక్ చెప్పారు. ఆ బ్రేక్ లో హీరో హీరోయిన్లు ఇద్దరినీ చూస్తూ..స్కెచ్ లు వేస్తుంటే…వారికి నచ్చిన స్కెచెస్ ప్రకారం స్టిల్స్ తీయిస్తున్నారు. మరికొన్ని స్టిల్స్ వారి స్టయిల్లో తీయించారు.ఈ సినిమా స్టిల్ ఫోటోగ్రాఫర్ జనతా కోటేశ్వరరావు గారి కుమారుడు బాబ్జీ. షూటింగ్ చాలా ఉత్సాహంగా,హుషారుగా సాగుతోంది.మళ్లీ బ్రేక్…లంచ్ బ్రేక్…టెక్నీషియన్స్ తో పాటు లైట్ బాయ్స్ తో సహా అందరూ భోజనాలకు సిద్ధమవుతున్నారు. ఇంతలో ఎన్టీఆర్..శివప్రసాద్ గారు భోంచేశారా…ఎక్కడన్నా నిద్ర పోతున్నారేమో లేపండి అని గట్టిగా అనేసరికి అందరూ ఆశ్చర్యంతో ఎవరీ శివప్రసాద్ అన్నట్టు చూశారు. అంతటి ఎన్టీఆర్..నా భోజనం గురించి అలా అనేసరికి చెప్పొద్దూ…ఒకపక్క ఆశ్చర్యం మరోపక్క ఆనందం.

ఆప్తులారా! ఈ సినిమాకి నిర్మాత,దర్శకుడే కాక హీరో అయి ఉండి కూడా ఎన్టీఆర్..నన్ను గుర్తు పెట్టుకొని ఆరా తీసిన విషయం అప్పుడే కాదు ఎప్పుడు తలచుకున్నా మహదానందమే.ఈ సంగతి మీక్కూడా సంతోషం కలిగిస్తుందనుకుంటున్నా.ఈ పెయింటింగ్ గురించి…చాణక్య గెటప్-లో ఎన్టీఆర్.. అశోకుడి గెటప్ లో బాలకృష్ణ. కోర మీసాలతో, చక్కటి తలకట్టుతో ఉండే ఎన్టీఆర్-ని గుండుతో, మీసాల్లేకుండా చూపించడం చాలా కష్టం.అదృష్టం కొద్దీ పోలికలు..బాగా వొచ్చాయి.ఏమైందో ఏమో…! చివరికి సినిమాలో అశోకుడు వేషం కూడా వారే వేశారు.

– దాకోజు శివ ప్ర‌సాద్, విఖ్యాత చిత్ర‌కారులు

Read more RELATED
Recommended to you

Latest news