తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ వ్యవహారం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కేసీఆర్ టీం వ్యూహాత్మకంగా నడుచుకుంటోంది. ఈటల రాజేందర్ (Etela Rajender) విషయంలో ఎవరిని పడితే వారిని మాట్లాడనివ్వని కేసీఆర్.. కేవలం కొందరితోనే సమాధానం చెప్పిస్తున్నారు. ఇప్పటి వరకు ఈటలకు అనుకూలంగా ఉన్న టీఆర్ ఎ స్ నేతలతోనే ఆరోపణలు చేయించిన కేసీఆర్ టీం.. ఇప్పుడు కార్మిక సంఘాలను రంగంలోకి దింపుతోంది.
ఈటల తాను రాజీనామా చేస్తున్నానని చెప్పిన సందర్భంగా కవిత, హరీశ్ రావులపై అనేక కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. కవితను బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్, ఆర్టీసీ కార్మిక సంఘం టీఎంయూలకు అధ్యక్షురాలని చేశారని, ఆమె ఎప్పుడైనా వారి సమస్యల గురించి మాట్లాడారా అంటూ ప్రశ్నించారు.
ఆ సంఘాలకు ఆమెకు ఏం సంబంధం అంటూ ఈటల విమర్శలు చేశారు. అయితే వీటిపై డైరెక్టుగా కవిత మాట్లాడకుండా.. ఆ కార్మిక సంఘాలతోనే ఈటలకు కౌంటర్ ఇప్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్టీసీ కార్మిక సంఘం టీఎంయూ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆర్టీసీ గురించి గానీ, కవిత గురించి గానీ ఈటల విమర్శలు చేస్తే తాము నోరు విప్పవలసి వస్తుందని ఇన్ డైరెక్టుగా కౌంటర్ వేశారు. కష్టాల్లో ఉన్న ఆర్టీసీని సీఎం కేసీఆర్ ఆదుకున్నారని, కవిత తమ సమస్యను పరిష్కరిస్తున్నారని వెల్లడించారు.