ఏ నోట విన్నా ఇప్పుడు తెలంగాణలో హుజూరాబాద్ చర్చనే నడుస్తోంది. ఎవరిని కదిలించినా ఆ ఎన్నికలపైనే ఫోకస్ ఉంది. అన్ని పార్టీలూ ఈ ఎన్నికలను కీలకంగా తీసుకుంటున్నాయి. ఎందుకంటే ఈటల రాజేందర్ సవాల్ చేసి మరీ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇంకోవైపు టీఆర్ఎస్ కూడా ఈటలను ఓడించి తమ పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.
దీంతో అసలు టీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై మొదటి నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలువురి పేర్లు వినిపించినా ఎవరినీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు టీఆర్ఎస్ నేతలు. అయితే ఈ క్రమంలో మరో నేత పేరు ఇప్పుడు తెరమీదకు వచ్చింది. ఆయనే కరీంనగర్ జిల్లా ట్రస్మా అధ్యక్షుడు సంజీవరెడ్డి.
మాజీ మహారాష్ట్ర గవర్నర్ ప్రధాన అనుచరుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన నిన్న హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. చేరేముందు ట్రస్మా ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసి టికెట్ హామీ డిమాండ్‌ను టీఆర్ఎస్ ముందు పెట్టినట్టు తెలుస్తోంది. వీటికి ఒప్పుకుంటే ట్రస్మా తరఫున ప్రచారం కూడా చేస్తామంటూ ఆ సంస్థ సభ్యులు హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఇది టీఆర్ఎస్‌కు కలిసొచ్చే అంశమనే చెప్పాలి. మరి టీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.