అప్పటివరకు ఆమె ఓ సాధరణ గిరిజన మహిళ. ఎవరికీ అంతగా పరిచయం లేని ఓ జానపద కళాకారిని. చుట్టూ ఉన్న చెట్టు, గట్టు, పుట్ట, పశువులు, గొర్రెలను మేపడమే ఆమె ప్రపంచం. కానీ ఒక్క పాట ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆమెను దేశానికి పరిచయం చేసింది. అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసింది. తనే నాంజియమ్మ. ఆమె గురించే ఈ కథనం…
2020లో మలయాళంలో వచ్చిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్, బీజుమేనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో నాంజియమ్మ స్వయంగా రాసి పాడిన పాట ‘కలకాత్తా’కు జాతీయ అవార్డు దక్కింది. తాజాగా 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఆమెకు కూడా పురస్కారం వరించింది. ప్లే బ్యాక్ సింగింగ్‌లో జాతీయ అవార్డు అందుకున్న తొలి గిరిజన మహిళగా పేరు గాంచింది.
నాంజియమ్మది కేరళ పాలక్కడ్ జిల్లాలోని అట్టప్పడి అనే గిరిజన ప్రాంతం. 15ఏళ్లకే పెళ్లి చేసుకుంది. ఆమె భర్త తనను ఎప్పుడూ ప్రోత్సహించేవాడు. గిరిజన తెగకు చెందిన ఈమె.. జానపద కళాకారిని. చెట్టు, గట్టు, పుట్ట, పశువులను చూస్తూనే అలవోకగా జానపద పాటలు పాడుతుంది. గిరిజన కళాకారుల సంఘం ఆట కళాసంఘం, ఆజాద్ కళా సమితిలో ఆమె సభ్యురాలు కూడా. పళని స్వామి ఆజాద్ కళా సమితి వ్యవస్థాపకుడు. ఈయన ద్వారానే నాంజియమ్మ గురించి తెలుసుకున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ దర్శకుడు సచీ.. గీతం పాడేందుకు ఆమెకు ఒక అవకాశం ఇచ్చాడు. అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా చిత్రీకరణ కూడా అక్కడే జరిగింది. 2020లో విడుదలై ఈ మూవీ మాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి దర్శకుడు, రచయిత సచీ. దురదృష్టవశాత్తు.. ఇది ఆయనకు రెండోది, చివరిది కూడా. ప్రస్తుతం ఆయన లేరు.
అవార్డును ఆయనకు అంకితమిస్తూ.. “నా కొడుకు ఫోన్ చేశాడు. ఓ సారి టీవీ చూడు అన్నాడు. అవార్డు వచ్చిందని చెప్పాడు. అదేంటో, దాని గొప్పతనం కూడా సరిగ్గా తెలియదు. కానీ అతడి మాటలు సంతోషాన్ని ఇచ్చాయి. ఈ పురస్కారాన్ని నేను సచీ సార్‌కు అంకితం చేస్తున్నాను. నేను కొండలపై గొర్రెల, ఆవులను మేపుతుంటాను. ఆయన నా గురించి తెలుసుకుని, నా చేత పాట పాడించారు. నేను, నా పాటను అందరికీ తెలిసేలా చేశారు. ఆయనకు ధన్యవాదాలు.” అని చెప్పింది.