వ్యాపారంలో దూసుకుపోతున్న గిరిజన మహిళలు..సబ్బుల తయారీతో లాభాలు..

-

ఒకప్పుడు మహిళలు వంటింటి నుంచి బయటకు రావడానికి కూడా ఇష్టపడే వాళ్ళు కాదు..కానీ తర్వాత ఆర్థిక పరిస్థితుల కారణంగా తర్వాత కూలీలుగా మారుతున్న సంగతి తెలిసిందే..రోజువారి వ్యవసాయ కూలీలుగా జీవనం కొనసాగించేవారు. వచ్చే కూలి డబ్బులు కుటుంబ పోషణకు సరిపోయేవి..నేడు ఆ మహిళలే లక్షల్లో వ్యాపారం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ములుగు జిల్లా ఐటీడీఏ ఏటూర్‌నాగారం పరిధిలో శివాపురం అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలోని తొమ్మిది మంది నిరుపేద గిరిజన మహిళలు జట్టుగా ఏర్పడి సబ్బుల తయారీ పరిశ్రమ పెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు.
ఐటీడీఏ ఏటూర్‌నాగారం అండగా నిలబడగా, గిరిజన సహకార సంస్థ వెన్ను దన్నుగా నిలిచి సహాయం అందించింది. గిరిజన మహిళలను ఆర్థికంగా మెరుగు పరచాలని ఐటీడీఏ సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలోనే ఆ మహిళలతో సబ్బుల పరిశ్రమ పెట్టాలని అధికారులు నిర్ణయించుకున్నారు.

కొందరు మహిళలను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు.ఏజెన్సీ ప్రాంతంలో సబ్బుల పరిశ్రమ స్థాపించాలని ఐటీడీఏ నిర్ణయించారు. అయితే పరిశ్రమ నిర్వహణ ఎలా ఉండాలి? పరిశ్రమలో సబ్బులను ఎలా తయారు చేయాలి? అనే విషయాలపై గిరిజన మహిళలకు అవగాహన లేదు. దీంతో శివాపురం గ్రామానికి చెందిన మహిళలకు హైదరాబాదులో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ అందించారు.

పరిశ్రమకు సంబంధించిన పూర్తి వివరాలపై శిక్షణ ఇచ్చారు. ట్రైనింగ్ అనంతరం మీటింగ్ నిర్వహించిన ట్రైబల్ కమిషనర్ పరిశ్రమ స్థాపించాలనే గిరిజన మహిళలకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడంతో శివాపురం గ్రామానికి చెందిన మహిళలు కొందరు ఆసక్తి చూపిస్తున్నారు.. శివపురంలో స్థాపించిన పరిశ్రమలో గిరి డిటర్జెంట్ బార్ పేరుతో సబ్బులను తయారు చేస్తున్నారు. ఈ సబ్బు తయారీలో 15 రకాల ముడి సరుకులు వేసి అత్యంత నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ఒక సబ్బు 150 గ్రాముల బరువు ఉండేలా తయారు చేస్తున్నారు..

స్థానికంగా ఉండే సౌజన్య అనే మహిళకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది..మిగతా మహిళలకు తగిన అవగాహన కల్పిస్తూ స్థాపించిన పరిశ్రమను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుంది సౌజన్య. శివాపురంలో సబ్బుల పరిశ్రమ పెట్టాలంటే ఒక సంఘంగా ఏర్పడాలని అధికారులు చెప్పడంతో 9 మంది మహిళలతో శ్రీ సమ్మక్క సారలమ్మ జాయింట్ లైబిలిటీ గ్రూప్ ఏర్పాటు చేసి, పరిశ్రమను స్థాపించడంలో ముందడుగు వేశారు. ఈ గ్రూప్‌కి ధనసరి సౌజన్య అధ్యక్షురాలుగా ఉండటంతో పాటు పూనమ్ రమ అనే మహిళ కార్యదర్శిగా, మిగతా మహిళలను సభ్యులుగా ఉన్నారు. పరిశ్రమలు స్థాపించినప్పటికీ అందులో పని చేస్తూ అటు యజమానులుగాను ఇటు పనివారుగాను నిరంతరం శ్రమిస్తూ ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.ఆదాయం మొత్తం చెక్కుల రూపంలో వస్తున్నాయి..

ప్రస్తుతం ఆర్దర్లు ఎక్కువగానే రావడంతో చేతినిండా పని దొరుకుతుందని 6 నెలల వ్యవధిలోనే రూ. 50 లక్షలకు పైగా ఆదాయం రావచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గిరిజన వసతి గృహాలకు మాత్రమే ఈ సబ్బులను సప్లై చేస్తున్నారు. రాబోయే కాలంలో అన్ని రకాల శాఖల ఆధ్వర్యంలో నడిచే వసతి గృహాలకు సప్లై చేయవలసిందిగా ట్రైబల్ కమిషనర్ చొరవ తీసుకుంటున్నారు. అన్ని రకాల వసతి గృహాలకు గిరి డిటర్జెంట్ బార్ సబ్బులను సరఫరా చేస్తే ఈ తొమ్మిది మంది మహిళలు స్థాపించిన పరిశ్రమ కోట్ల రూపాయలు ఆదాయం ఆర్జించే అవకాశం ఉంటుంది..వీరు ఇప్పుడు చాలా మంది మహిళలకు ఉపాధిని కల్పిస్తూ వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news