కేసీఆర్.. నిన్ను మునుపటిలా చూడాలి..

-

టీఆర్ఎస్.. యుద్ధం చేసి గెలిచిన పార్టీ. ఉద్యమమే ఊపిరిగా.. పోరాటమే పునాదులుగా.. తెలంగాణ జాతి కోసం, తెలంగాణ ఖ్యాతి కోసం మాత్రమే ఉదయించిన పార్టీ. కేసీఆర్.. కదనరంగంలో పోరాడి గెలిచిన వీరుడు. 60 ఏళ్ళ దాస్యశృంఖలాలను తెంచిన ధీరుడు.. తెలంగాణ స్వేచ్ఛకు ఊపిరిలూదిన కారణజన్ముడు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవవానికి ప్రతీక. మన అస్థిత్వానికి వెన్నెముక. తెలంగాణ జాతికి ఊపిరి పోసిన ప్రాణ దాత. అలాంటి వీరోచిత పోరాట చరిత్ర ఉన్న తెలంగాణ రాష్ర్ట సమితి (టీఆర్ఎస్) పుట్టి నేటికి 21 ఏళ్లు నిండుతున్నాయి. పార్టీలో పండుగ వాతావరణం. నేతల్లో, కార్యకర్తల్లో జోష్. తన తల్లి పుట్టినరోజుకు ఎంతలా ఆనందిస్తామో.. అదే స్థాయిలో పులకరించిపోయే సందర్భం.

2001, ఏప్రిల్ 27న జలదృశ్యం వేదికగా తెలంగాణ బంధనాలను తెంచేందుకు.. సీమాంధ్రుల పెత్తందారిని ఎదిరించేందుకు కొదుమ సింహం వలె కదనరంగంలోకి దూకిన రోజు అది. ఇక్కడి ప్రజలు.. ఇంకా బాంచన్ కాల్మొక్తా అంటూ..బానిస బతుకులు ఈడుస్తుంటే.. వెన్ను చరిచి..వారిలో చైతన్యాన్ని కలిగించి పోరాట స్ఫూర్తిని రగిలించిన రోజు అది. పిడికెడు మందితో మొదలైన ఆ ఉద్యమం ఆకాశమంత ఎగసిపడి. ప్రళయకాల రుద్రుడిలా గర్జించి శత్రువు గెండెల్లో గుణపం దింపింది. తెలంగాణ ద్రోహుల వెన్నుల్లో చలి పుట్టించి.. పరాయి పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించి.. సబ్బండ వర్ణాలను కదనరంగంలోకి దూకించారు. అసాధ్యమని అవహేళన చేసిన వారి పట్ల సింహస్వప్నంలా పరిణమించి, తెలంగాణ జాతికి స్వేచ్చా వాయువులను అందించారు. కలలోనైనా సాధ్యపడుతుందా అనుకున్న నాలుగున్నరకోట్ల ప్రజల మనోభీష్టాన్ని సాకారం చేశారు. మన తెలంగాణను మన కళ్ల ముందు నిలిపారు. మనల్ని గెలిపించారు. ఆయన గెలిచారు. ప్రజల ఆత్మగౌరవ బావుటాను రెపరెపలాడించారు. జన హృదయాలు ఉప్పొంగిపోయాయి. ఉక్కు సంకల్పం లాంటి ఆ ఉద్యమం చరిత్రపుటల్లో శాశ్వత చోటు కల్పించుకుంది.

పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు. అనేక ఆటుపోట్లు. కప్పదాట్లు. పార్టీ పని అయిపోయిందన్న మాటలు. ఆనవాళ్లే లేకుండా చేస్తామన్న హెచ్చరికలు. ఫినిష్ అంటూ బెదిరింపులు. ఇలా అనేక సంక్షోభాలను తట్టుకుంటూ తన ప్రస్థానాన్ని సాగించింది.రాజీనామాలే అస్ర్తంగా తెలంగాణ పౌరుషాన్ని.. పోరాట పటిమను అడుగడుగునా నిలిపింది. తెలంగాణ సాధించుకోవాలనే ఆరాటాన్ని సజీవంగా నిలిపింది.

కేసీఆర్.. ఒక ఉద్యమకారునిగా, ఒక నాయకునిగా, ఒక ముఖ్యమంత్రిగా, అసాధారణమైన మేధోసంపత్తి కలిగిన నేతగా విజయం సాధించారు.రాష్ట్ర పునర్నిర్మాణంలో కేసీఆర్ అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. తనదైన విజనరీతో ముందుకు పోతున్నారు.‘‘మా ప్రాంతానికి ఇట్లాంటి నాయకుడు ఉంటే బాగుండు’’ అని మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది.

కేసీఆర్ తెలంగాణకు వరం. ప్రజల నీటి గోసను తీర్చేందుకు కేసీఆర్ పడిన శ్రమ అంతా ఇంతా కాదు. తెలంగాణ రైతాంగం నష్టపోతున్నది, అష్టకష్టాలపాలవుతున్నది సాగునీరు, తాగునీరు, కరెంటు లేకనే. ఇది గుర్తించే ముందుగా కరెంటు సమస్యను పరిష్కరించారు. రాత్రింబవళ్లు శ్రమించారు. ఫలితం.. అప్పటి నుంచి ఇప్పటిదాకా సమస్య తలెత్తలేదు. ఇప్పుడు కూడా దేశమంతా కరెంటు కోతలే. కానీ రాష్ర్టంలో ఒక్కచోట కూడా కనిపించడంలేదు. ఇది కేసీఆర్ శ్రమ ఫలితమే. ఈ కరెంటు సంక్షోభం నుంచి తెలంగాణను గట్టెక్కించుకోవడం సమైఖ్యాంధ్రలో సాధ్యమయ్యేదా? మన రాష్ట్రం..మన ముఖ్యమంత్రి.. మన అధికారులు..ఒక్కటయితే ఏం చేయగలరో అన్నదానికి ఈ రుజువు.

తెలంగాణ ప్రజలు నీళ్లకోసం ఎంతలా అరిగోసపడ్డారో ఆయనకు ఎరుక. తెలంగాణలో రైతులు బోర్లు వేసీ వేసీ అప్పుల పాలయి ఆత్మహత్యలు చేసుకున్నారు. బావులు ఎప్పుడో ఎండిపోయాయి. చెరువులు పూడుకుపోయాయి. బోర్లు వందల ఫీట్ల లోతుల్లోకి పోతున్నాయి. అయినా నీళ్లు లభించని పరిస్థితి. తెలంగాణ రైతులు భూగర్భ జలాలకోసం ఏటా 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన దుస్థితి. రైతుకు నీళ్లివ్వగలిగితే ఆ 25 వేల కోట్లు తెలంగాణ రైతుకు మిగులు. తెలంగాణ ప్రజల ప్రధాన సమస్యలు రాయాల్సివస్తే సాగునీరు, తాగునీరు గురించే మాటిమాటికీ రాయడమే. అందుకే కేసీఆర్ ప్రాజెక్టుల సమస్యను అంతగా ముందేసుకున్నారు.

అందుకే.. కాళేశ్వరంతో పాటు అనేక ప్రాజెక్టులకు అంకురార్పణ చేసి అకుంఠిత దీక్షతో పూర్తి చేశారు. ఫలితం… ఇప్పుడు రాష్ర్టం జలకళతో ఉట్టిపడుతున్నది. మండుటెండల్లోనూ ఉబికి వచ్చిన భూగర్భజలాలు, నిండుగా కనిపిస్తున్న వాగులు, వంకలతో సజీవంగా దర్శనమిస్తున్నది. నేలతల్లి పులకరిస్తున్నది. తన ప్రజలకు తాను చేయదల్చుకున్నది చేసి పారేశారు. ఎవరి ఆమోదం కోసమూ ఎదురు చూడలేదు. ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా తలకిందులుగా తపస్సు చేసినా ఆయన వెరువలేదు.

ఇన్ని విజయాలు సాధించినా అక్కడో ఇక్కడో తప్పులతో సమస్యలు ఎదురవడం సహజం. ఎవరు కాదన్నా అవున్నా.. రెండో దఫా అధికారం చేపట్టిన తర్వాత కేసీఆర్‌పై వ్యతిరేకత ఏర్పడిందన్నది నిష్టుర సత్యం. ప్రజల్లో గూడు కట్టుకుంటున్న అసంతృప్తిని పసిగట్టడంలో టీఆర్‌ఎస్‌ నాయకత్వం విఫలమైందనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి.

జీహెచ్ఎంసీ‌తో పాటు దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఓ పాఠంగా భావించి ముందుకు వెళ్లాల్సిన అవసరముంది. కేసీఆర్ వంటి ముందుచూపున్న నాయకుడు ముఖ్యమంత్రిగా లేకుంటే కరెంటు, తాగునీటి సమస్య తీరేదా?ఆయనే లేకుంటే తెలంగాణ పరిస్థితి ఎలా ఉండేదో..? తలుచుకుంటేనే భయమేస్తోందన్న కొందరి వ్యాఖ్యలు నిజమేనని అనిపిస్తోంది. ఎదురవుతున్న సవాళ్లను, పెరుగుతున్న వ్యతిరేకతను గుర్తించి ఈ ప్లీనరీలో దిశానిర్దేశం చేసుకోవాలన్నది అందరి ఆశ. మునుపటి కేసీఆర్‌ను చూడాలన్నది తెలంగాణ ప్రజల కోరిక.

Read more RELATED
Recommended to you

Latest news