గులాబీ బాస్ ఫోకస్ పెట్టిన ఆ అదృష్టవంతులెవరు?

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఎమ్మెల్సీ స్థానాలపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఈటల రాజేందర్ రాజీనామాతో ఈసారి బీసీ లకే పెద్దపీఠ వేయాలని నిర్ణయించారు. ఏడు ఖాళీల్లో ఐదు స్థానాలు బలహీన వర్గాల నేతలతో భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఇంతకీ ఆ ఛాన్స్ దక్కే అదృష్టవంతులెవరు? ఆశలు పెట్టుకున్న నేతలెవరు?

ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలపై అధికార పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. భర్తీపై అధినేత దృష్టి పెట్టడంతో గులాబీ దళంలో సందడి వాతావరణ నెలకొంది.  దీంతో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బాస్ ఆశీస్సుల కోసం శ్రమిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు.. గవర్నర్ కోటాలో ఒకరు.. మొత్తం ఏడుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది. అందులో గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్..కడియం శ్రీహరి, ఆకుల లలిత.. బోడకుంటి వెంకటేశ్వర్లు.. ఫరీదుద్దీన్, శ్రీనివాస్ రెడ్డి పదవీ కాలం ముగిసింది. అయితే వారి స్థానాల్లో కొత్త ఎమ్మెల్సీల నియామకం జరగాల్సి ఉంది. కానీ ఈ ప్రక్రియ కరోనా కారణంగా వాయిదా వాయిదా పడింది. దీంతో ఆ స్థానాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ల పదవీ కాలం కూడా ముగియడంతో ప్రొటెం చైర్మన్‌గా భూపాల్ రెడ్డి నియామకం జరిగింది.

ఇప్పుడు కరోనా ప్రభావం కొంత తగ్గింది. ఏ క్షణమైనా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈటల రాజేందర్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడం స్పీకర్ ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. హుజురాబాద్ స్థానాన్ని ఖాళీగా చూపుతూ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఆరు నెలలలోపు హుజూరాబాద్‌లో ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీంతో బీసీలపై గులాబీ బాస్ కేసీఆర్ ఫోకస్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఈటల రాజేందర్ పేరున్న బీసీ
నాయకుడు కావడంతో ఇతర బీసీ‌లను ఎంకరేజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందుకే పేరు, పలుకుబడి ఉన్న నాయకులనుఅన్వేషించే పనిలో పడ్డారట. అలాంటి వారిని గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చిప్రోత్సహించాలని డిసైడ్ అయ్యారు. ఈటలతో జరిగిన డ్యామేజ్‌నుపూడ్చుకోవాలని భావిస్తున్నారట.

ప్రస్తుతం ఉన్న ఏడు ఎమ్మెల్సీ స్థానాల్లో విశ్వబ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ..పద్మశాలి, కుమ్మరి, ముదిరాజ్ సామాజిక వర్గం నేతలకు కట్ట బెట్టాలని చూస్తున్నారట. విశ్వబ్రాహ్మణుల కోటాలో మాజీ స్పీకర్ మధుసూధనా చారి పేరును దాదాపు ఫైనల్ చేశారని తెలుస్తోంది. నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి రాష్ట్ర నేత ఒకరు..హైదరాబాద్‌కి చెందిన ఓ మాజీ కార్పొరేటర్ భర్త పేరు రేసులో వినిపిస్తున్నాయి. ఓ సంఘం నాయకుని పేరును కుమ్మరి సామాజిక వర్గం నుంచి పరిశీలిస్తున్నారట. పద్మశాలి సామాజిక వర్గం నుంచి మొన్నటి వరకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేరు వినిపించింది. కానీ ఆ కోటాలో ఎల్. రమణ చేరితే ఆయనకు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మాజీ జేఏసీ నేత పిట్టల రవీందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది..

మిగిలిన రెండింట్లో ఒకటి నల్గొండ జిల్లాకు చెందిన ఎంసి కోటి రెడ్డి‌కి ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంలో కోటిరెడ్డికి స్వయంగా కేసీఆర్ హామీ ఇచ్చారు. మిగిలిన ఒక్కటి.. సిటింగ్‌లో ఎవరికైనా రెన్యువల్ చేస్తారా లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం పదవీ కాలం ముగిసిన వారిలో గుత్తా‌కు మరోమారు ఛాన్స్ ఇవ్వొచ్చని టాక్ నడుస్తోంది. ఒకరు మైనారిటీ నేత ..మరొకరు మహిళా నేత ఉన్నందున వారిలో ఒకరికి అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి గులాబీ బీస్ ఎవరికిస్తారో చూడాలి.