మరో వారంలో టీఆర్ఎస్ ప్లీనరీ జరుపుకోనుంది. పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండటంతో పాటు ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ప్లీనరీ నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఏర్పడింది. ఇందులో పార్టీ నాయకులకు, శ్రేణులకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన సంకేతాలు కూడా ఇవ్వనున్నారు. నిజానికి ఈ ప్లీనరీ టీఆర్ఎస్ కు పెద్ద పండుగ వంటిదే. ఇంతవరకు బాగానే ఉన్నా.. గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు పార్టీ అధినేతను, ఇతర ముఖ్యనేతలకు చికాకు కలిగిస్తున్నాయని పార్టీ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ముఖ్యంగా కిందిస్థాయిలోని చోటామోటా నేతల ఆగడాలు పెరిగిపోయాని, వారి దౌర్జన్యాలతో ప్రజలు పార్టీకి దూరమవుతున్నారని వాపోతున్నారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుమ కుమారుడు వనమా రాఘవ ఉదంతం మొదులుకుని మొన్నటి రామాయంపేట ఘటన వరకు పార్టీకి మచ్చ తెచ్చేలా ఉన్నాయని చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నా కొన్ని మాత్రమే వెలుగులోకి రావడంతో చర్చ నీయాంశమవుతోంది. నిజానికి.. అనేక చోట్ల వివిధ పదవుల్లో ఉన్న నేతలు బెదిరింపులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఇసుక దళారుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరికొందరైతే ఏకంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. కళ్లెదుట వారి అక్రమాలు కనిపిస్తున్నా ప్రశ్నించేవారే నిలదీసే నేతలే కరువయ్యారు.
నిజానికి కొన్ని సందర్భాల్లో పార్టీ కింది స్థాయి నేతలక అధిష్టానం కంట్రోల్ తప్పిందా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. వీరి వికృత చేష్టలు పెద్దలకు కనిపిస్తున్నా.. గులాబీ పార్టీ నేతలు మాత్రం కిమ్మనడం లేదు. ఇదే అదనుగా ఆ చోటామోటా నేతలు రెచ్చిపోతున్నారు. వీరి చేష్టలే ఇప్పుడు విపక్షాలకు ఆయుధంగా మారాయి. ఇదే అదనుగా బీజేపీ ఈరోజు రాష్ర్ట వ్యాప్తంగా నిరసనలకు దిగుతోంది. కాపాడాల్సిన పాలకులే సామాన్యులపై జులుం ప్రదర్శించటాన్ని కేసీఆర్, కేటీఆర్ చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారనే ఆరోపణలు పెరుగుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్‌లో బీజేపీ చేతికి తేలికగా పగ్గాలు ఇచ్చినట్టే అవుతుందనే ఆందోళన గులాబీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. భవిష్యత్‌లో టీఆర్ ఎస్ పార్టీ ఉనికినే ప్రశ్నార్ధకంగా మారుతుందనే ఆందోళన పెరుగుతోంది.