టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గల్లీ బాట పట్టారు. ప్రజల మధ్యకు వెళ్తున్నారు. అయితే ప్రతిపక్షాలు బలపడుతుండడమే ఇందుకు కారణం అన్న టాక్ నడుస్తున్నా… మార్పు మంచిదే అంటున్నాయి పార్టీ వర్గాలు. కొత్త సంవత్సరం కొత్త కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నించడం పార్టీ కేడర్ లోనూ కొత్త జోష్ తీసుకొస్తుందట…
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు న్యూ ఇయర్‌కి కొత్త కార్యక్రమాలతో జనంలోకి వెళ్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించేందుకు ఎమ్మెల్యేలు కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. పల్లెలు, పట్టణాల్లో పర్యటనలకు వెళ్లేందుకు సిద్ధమైయ్యారు. వారంలో ఒకరోజు అధికారులతో కలిసి పాదయాత్రలు చేయడంతో పాటు పల్లెనిద్రలు చేయాలని నిర్ణయించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్యలు పల్లె, పట్టణ బాటకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రతిరోజు శుభోదయం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారు. ఇటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్టణ, పల్లె ప్రగతిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకుని సాధ్యమైన వాటికి అక్కడికక్కడే పరిష్కరం చూపాలన్న లక్ష్యంతో అధికారులతో కలిసి ప్రతి సోమవారం ప్రజల మధ్యకు వెళ్తున్నారు. అలాగే పల్లెనిద్ర కార్యక్రమాన్ని జనవరి 11 నుంచి ప్రారంభిస్తున్నారు.
ఎన్నికల వేళ మాత్రమే కనిపించే నాయకులు… ఇలా కొత్త కార్యక్రమాలతో జనంలోకి వెళ్లడం శుభపరిణామమని అంటున్నారు. మరోవైపు విపక్షాలు బలపడుతుండడంతో… అధికారపార్టీ ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.