దుబ్బాక ఓటమి నేర్పిన పాఠాలతో సాగర్ లో మథనం ప్రారంభించింది టీఆర్‌ఎస్.నాగార్జునసాగర్ ఉపఎన్నికకు బలమైన అభ్యర్థి వేటలో పడింది గులాబీ దళం. ముందుగా అభ్యర్థి ఎంపికలోనే పక్కాగా ఉండాలన్నది టీఆర్‌ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. దుబ్బాకలో ఈ విషయంలో పార్టీ మైనస్ అయినట్టు టీఆర్‌ఎస్ వర్గాల అభిప్రాయం. అయితే టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేయాలని ఆసక్తితో ఉన్న సొంత పార్టీ నేతలు ఎవరు.. వారిలో ఆర్థిక, అంగబలం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు అన్న అంశాలపై ఫోకస్ పెట్టారట పార్టీ పెద్దలు.
దుబ్బాక ఉపఎన్నికలో జరిగిన తప్పులను రిపీట్ చేయకుండా అప్రమత్తంగా అడుగులు వేస్తోంది అధికార టీఆర్ఎస్ పార్టీ. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణం తర్వాత నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులను టీఆర్‌ఎస్ ఆరా తీస్తోంది. మండలాల వారీగా ఉన్న వివరాలు సేకరిస్తోందట. ప్రజల మూడ్‌ను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. నర్సింహయ్య మరణం తర్వాత అక్కడ నుంచి పోటీ చేయడానికి ఆయన కుమారుడు నోముల భగత్ ఆసక్తితో ఉన్నారు. కొద్దినెలలుగా నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరుగుతున్నారు కూడా. అయితే దుబ్బాకలో సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు. మరి.. నాగార్జునసాగర్‌లో సెంటిమెంట్‌ను టీఆర్‌ఎస్ పరిగణనలోకి తీసుకుంటుందా.. లేదా అన్నది చర్చగా మారింది.
నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తేరా చిన్నపరెడ్డి ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే టీఆర్‌ఎస్ నుంచి పోటీకి ఆయన ఆసక్తి కనబరిచారు. కానీ.. పార్టీ నోముల నర్సింహయ్యకు అవకాశం ఇవ్వడంతో సైలెంట్ అయ్యారు. అయినా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా చిన్నపరెడ్డికి ఛాన్స్ ఇచ్చింది టీఆర్‌ఎస్. ఒకవేళ చిన్నపరెడ్డి పోటీకి ఆసక్తి చూపిస్తే.. పార్టీ అవకాశం ఇస్తుందా లేదా అన్నది చూడాలి.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలవాలనే పట్టుదలతో ఉన్న టీఆర్‌ఎస్.. ఇతర పార్టీలలో బలమైన అభ్యర్థులుగా ఉన్నవారిపైనా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ముందుగా మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డిపై దృష్టి సారించింది. ఆ దిశగా మంత్రాంగం కూడా మొదలైందన్న ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పెట్టిన ప్రతిపాదనలకు జానారెడ్డి అంగీకరిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.
ఇక టీఆర్‌ఎస్‌కే చెందిన పలువురు నాగార్జునసాగర్ నాయకులు సైతం ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు సై అంటున్నారు. స్థానిక టీఆర్‌ఎస్ నేత కోటిరెడ్డి, ఎన్ఆర్ఐ గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి ఆశావహుల జాబితాలో ఉన్నారట. అయితే వీరెవరు కాకుండా జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి కొత్తగా ఎవరినైనా ప్రతిపాదిస్తారా అన్న చర్చ కూడా ఉంది. మరి.. అభ్యర్థి ఎంపికలో టీఆర్ఎస్ ఎలాంటి మార్కు కనబరుస్తుందో చూడాలి.