ఎలాగూ వరంగల్ లో టీఆర్ఎస్ కే పట్టుంది. ఇక్కడ ప్రతిపక్షాలకు పెద్దగా బలం లేదు. కాబట్టి మనమే గెలుస్తాం. అలాంటప్పుడు ఏ సవాల్ చేస్తే ఏంటి అనుకున్నాడో ఏమో గానీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మొన్న ఓ సంచలన కామెంంట్ చేశాడు. ఆరు నెలల్లో టెక్స్ టైల్ పార్కు ప్రారంభిస్తానని.. లేదంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అయితే ఇక్కడే వరంగల్ జనం నుంచి భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి.
వీళ్లకు టెక్స్ టైల్ పార్కు ఇప్పుడే గుర్తకు వచ్చిందా.. మూడేళ్ల నుంచి ఆయనే మంత్రిగా ఉన్నారు గదా. మరి ఎందుకు ప్రారంభించలేదని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇదే విషయంంపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా విమర్శలు చేశారు. కేంద్రం ప్రాజెక్టులు కేటాయిస్తున్నా.. టీఆర్ ఎస్ ప్రభుత్వం భూమి కేటాయించట్లేదని.. అందుకే ప్రాజెక్టులు ఆగిపోతున్నాయని ఆరోపించారు.
ఇక దీనికి కూడా జవాబు చెప్పారు మంత్రి ఎర్రబెల్లి. తాము రైల్వే కోచ్ కోసం, గిరిజన యూనివర్సిటీ కోసం భూమి కేటాయించామని.. కానీ కేంద్ర ప్రభుత్వమే మంజూరు చేయలేదని విమర్శించారు.
ఈ ఇద్దరి మాటలతో వరంగల్ జనం అసలు ఎవరి మాటలు నమ్మాలో తెలియని అయోమయంలో ఉన్నారు. ఎన్నికలొస్తేనే ఇలాంటివి వీరికి గుర్తొస్తాయా అంటూ విమర్శిస్తున్నారు. ఎలాగైనా జిల్లాలో తన పట్టు నిలుపుకోవాలని మంత్రి.. అటు బీజేపీ తరఫున జిల్లా బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్ ఒకరి మీద మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అర్బన్ ఏరియాల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. చూడాలి మరి ఎవరు కింగ్ అవుతారో.