మే 30న తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో లాక్‌డౌన్ సహా ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయం పరిస్థితి, కొనసాగుతున్న ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధానికి చర్యలు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ భేటీలో మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర అధికారులు కూడా పాల్గొంటారు.
కాగా కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ మే 30న ముగియనుంది. ఈ నేపథ్యంలో మరోమారు లాక్‌డౌన్ పొడిగిస్తారా? లేదా అన్న అంశంపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్నది. తెలంగాణలో లాక్‌డౌన్ సత్ఫలితాలను ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి లోకి వచ్చే వరకు లాక్‌డౌన్ పొడగించడమే మంచిదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.