తెలంగాణలో త్వరలోనే 50వేల ఉద్యోగాల భర్తీ (Job replacement) చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా అధికారులు రాష్ట్రంలో శాఖల వారిగా ఖాళీలపై కసరత్తు మొదలెట్టారు. ఇక ఆదివారం చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీహెచ్ఆర్డీ)లో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో నూతన జోనల్ వ్యవస్థకు అనుకూలంగా వివిధ శాఖల్లో ఖాళీల వివరాలు సేకరించరించనున్నారు. అధికారులు జిల్లాలు, జోన్లు, బహుళ జోన్ల వారీగా ఖాళీల వివరాలు అందజేయనున్నారు. ఇక జులై 13న మంత్రివర్గ సమావేశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలియజేయనున్న నేపథ్యంలో.. ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి పక్కా వివరాలతో నివేదికను అందజేయనున్నారు. ఈ నివేదిక సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు చేరితే.. మరుసటి రోజున సీఎస్ ఆ నివేదికను సీఎం కేసీఆర్‌కు, మంత్రిమండలికి అందజేయనున్నారు.