టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచారు. ఈమేరకు ఉత్తర్వుల పత్రాలపై సీఎం కేసీఆర్ సంతకం కూడా చేశారు. ఆర్టీసీ, కార్మిక సంఘాలతో జరిపిన చర్చల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల నేపథ్యంలో ఈ పదవీ విరమణ వయసును పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇప్పటికే ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా పిలవాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, గతంలో ప్రగతి భవన్ లో కార్మికులతో ఆత్మీయ సమ్మేళన సమావేశంలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. కార్మికులతో కలిసి భోజనం చేస్తూ.పలు హామీలు ఇచ్చారు. అందులో భాగంగా మహిళ ఉద్యోగులకు రాత్రి 8 గంటల వరకు డ్యూటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే మహిళ ఉద్యోగులు కోరిన విదంగా ప్రసూతి సెలవులు మంజూరు చేశారు.