తిరుమలలో వసతి గదులు తీసుకునే వారికి TTD శుభవార్త చెప్పింది. తిరుమలలో వసతి గదులు దొరకడం లేదని చాలామంది భక్తులు ఫిర్యాదు చేశారని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని అడ్వాన్స్డ్ దర్శన టికెట్లు, బ్రేక్ దర్శన టికెట్లు పొందిన భక్తులు తిరుపతిలో బస చేసి స్వామివారి దర్శనానికి రావాలని ధర్మారెడ్డి సూచించారు.
ఈ మేరకు ఆదివారం ఉదయం తిరుమల అన్నమయ్య భవన్ లో డయల్ యువర్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 28 మంది భక్తులు తమకు ఎదురైన సమస్యలను ఈవో దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను తిరుపతిలో చేపట్టాలని నిర్ణయించామన్నారు. తద్వారా తిరుమలలో గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే వసతి పొందే అవకాశం ఉంటుందని వివరించారు. త్వరలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని మొదలు పెడతామని వెల్లడించారు.