జగిత్యాల: టీటీడీపీ అధ్యక్షుడు టీఆర్ఎస్లోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్లో అతనికి ఎమ్మెల్సీ ఇస్తారని తెలుస్తోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్ రమణను టీఆర్ఎస్లోకి తీసుకోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. గతంలో టీడీపీలో పని చేసి టీఆర్ఎస్లో చేరిన నేతలు ఈ మంతనాలు జరుపుతున్నారట.
కాగా 2014 నుంచి 2019 తర్వాత చాలా మంది టీడీపీ నేతలు వివిధ పార్టీల్లోకి వెళ్లినా ఎల్.రమణ మాత్రం టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. ఎల్. రమణ బీసీ సామాజిక వర్గంకు చెందిన సీనియర్ నాయకుడు. టీడీపీలో ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిచారు. ఓసారి మంత్రిగా కూడా పని చేశారు. జగిత్యాల నియోజకవర్గంలో మంచి పట్టున్న నాయకుడు. దీంతో ఎల్.రమణను కారెక్కిస్తే అటు ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టినట్లు అవుతుందని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోందట. ఈ నేపథ్యంలో ఎల్.రమణ రెండు రోజులుగా తన నియోజకవర్గంలోని అనుచరులు, పార్టీ కార్యకర్తలను కలుస్తున్నారు. తాను టీడీపీలో ఉండాలా..?.. ఇతర పార్టీల్లోకి వెళ్లాలా అనే దానిపై వాళ్ల అభిప్రాయాలను తీసుకుంటున్నారు.
అయితే పార్టీ మార్పు విషయంలో జగిత్యాల ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని ఎల్ రమణ తెలిపారు. ఈ మేరకే ముందుకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు. 27 ఏళ్లుగా జగిత్యాల ప్రజలతో ఉన్నానని చెప్పారు. ఇతర పార్టీలు ఏ విధమైన ప్రతిపాదననను తనకు పంపలేదని తెలిపారు. పార్టీలోకి రావాలని ఆహ్వానం పంపినట్లు ఎల్.రమణ స్పష్టం చేశారు. ఎవరికీ ఇంకా ఏ హామీ ఇవ్వలేదన్నారు. తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రచారం జరగడం దురదృష్టకరమన్నారని చెప్పారు. పదవుల కోసం పాకులాడనని, ఇతరుల పదవులకు అడ్డుపడనని ఎల్ రమణ పేర్కొన్నారు. స్వార్థ రాజకీయాల కోసం తన విధానం మార్చుకోనన్నారు. చంద్రబాబు తనకు, తన కుటుంబానికి ఎంతో చేశారని చెప్పారు. టీడీపీ రెక్కల కష్టం నుంచి ఎదిగానని, తన వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదని రమణ స్పష్టం చేశారు.