ప్రపంచ రక్తదాత దినోత్సవం: చరిత్ర, విశేషాలు, ప్రాముఖ్యత..

-

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతీ ఏడాది జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని జరుపుకుంటారు. రక్తాన్ని దానం చేయడంలో అందరికీ అవగాహన కల్పించడానికి ఈ రోజుని ప్రత్యేకంగా జరుపుతారు. మొదటి రక్తదాత దినోత్సవాన్ని 2004లో జరుపుకున్నారు. 2005నుండి ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం ప్రారంభించారు. ఆస్ట్రియన్ జీవశాస్త్రవేత్త కారల్ లాండ్ స్టీనర్ జ్ఞాపకార్థం రక్తదాత దినోత్సవాన్ని జరుపుతారు. ఆధునిక రక్తమార్పిడి పితామహుడిగా కారల్ లాండ్ స్టీనర్ గుర్తింపు తెచ్చుకున్నాడు.

రక్తదాత దినోత్సవం ప్రాముఖ్యత.

రక్తం ఇచ్చేవారు స్వఛ్ఛందంగా ముందుకు రావాలనీ, రక్తం ఇవ్వడం వల్ల చాలామంది ప్రాణాలు నిలబడతాయని, సరైన సమయంలో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, మానవుడే మాధవుడు అన్న నినాదంతో రక్తదానం చేయాలని అవగాహన కార్యక్రమాలు జరుపుతారు. ఈ ఏడాది ఇటలీలోని రోమ్ లో గ్లోబల్ బ్లడ్ డోనర్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

రక్తదాత దినోత్సవ థీమ్

ఈ సంవత్సరం రక్తదాత దినోత్సవ థీమ్ గా రక్తం ఇవ్వండి, హృదయ స్పందనలకు కారణం అవ్వండి అన్న నినాదాన్ని ఇచ్చారు. రక్తం ఇవ్వడం ద్వారా ఇతరుల ప్రాణాలు నిలబడేలా చేయాలని, దాని ద్వారా ప్రపంచ ఆరోగ్యానికి దోహదం చేయాలని పిలుపు ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు రక్తదానం చేయాలని, దీనికొరకు స్వఛ్ఛందంగా ముందుకు రావాలనీ, ప్రమాదాల్లో రక్తం పోగొట్టుకుని ఇబ్బందులు పడుతున్న వారి ప్రాణాలకు జీవం పోయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి చేసింది.

ఈ రక్తదాత దినోత్సవం రోజున మనదేశంలోనూ రక్తదాన కార్యక్రమాలు జరగనున్నాయి. ఇప్పటివరకు మీరు రక్తదానం చేయనట్టయితే, ఈ ప్రత్యేక రక్తదాత దినోత్సవం రోజున రక్తదానం చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news