యూపీ రాజకీయాల్లో కీలక మలుపు ఇది. మొత్తం ఏడు విడతల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి దాకా కొన్నిచర్చలు అయితే పార్టీల మధ్య నడుస్తున్నాయి.బీజేపీ ని ఢీ కొనే సత్తా తమకే ఉందని ఎస్పీ అంటోంది. అంతేకాదు యోగిని కూడా ఇంటికే పరిమితం చేసేలా రాజకీయం నడుపుతోంది.ఇందుకు టీఆర్ఎస్ సాయం కూడా తీసుకుంటోంది ఎస్పీ. సమాజ్ వాదీ పార్టీ బలపడితే బీజేపీ అన్నీ కష్టాలే రావొచ్చు. ప్రాంతీయ పార్టీల కూటమికి ఎస్పీ విజయం రేపటి వేళ ఎంతో అవసరం. బీజేపీ కూడా ఇలానే ఆలోచిస్తుందా? ఎందుకంటే తమ రాజకీయ జీవితం, భవితవ్యం అన్నీ యూపీ పైనే ఆధారపడి ఉన్నాయి.
యోగీ ఓడిపోతే అస్సలు మోడీ – షా ఏమౌతారో అన్న వాదనలు బెంగలూ వినిపిస్తున్నాయి. ఎందుకంటే జాతీయ స్థాయి రాజకీయాల్లో ఇప్పటిదాకా తిరుగులేని విధంగా రెండు సార్లు వరుస ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. కానీ ఇప్పుడు పరిస్థితులు ఆ విధంగా లేవు. సాగు చట్టాలకు సంబంధించిన రగడ కారణంగా బీజేపీపై వ్యతిరేకత ఉంది. అదేవిధంగా ధరల అదుపులో చర్యలు లేవు అని, అసలీ విషయమై నియంత్రణే లేదని ప్రజలు మండిపడుతున్నారు.ఇవన్నీ గుర్తు పెట్టుకుని మోడీకి యూపీ ప్రజలు బుద్ధి చెబితే 2024 ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు బీజేపీకి రావుగాక రావు.
సార్వత్రిక ఎన్నికలకు సాంపిల్ పీస్ అన్న విధంగా యూపీ ఎన్నికలు ఉన్నాయి.పార్టీలు పట్టు నిలుపుకుంటేనే రేపటి వేళ మనుగడ సాగించడం సాధ్యం.అందుకే బీజేపీ తనదైన పంథాలో కొన్నిహిందుత్వ రాజకీయాలు చేస్తోంది. ఇవి కాకుండా కొంత సానుభూతి రాజకీయాలకూ ప్రాధాన్యం ఇస్తోంది. యోగీ ఒకవేళ తను చెప్పినవన్నీ ప్రజలు నమ్మేలా చేస్తే, అప్పుడు బీజేపీ డ్రామా పండినట్లే! మోడీ స్థానంలో యోగి ఒకవేళ జాతీయ రాజకీయాల్లో కాలు పెడితే అప్పుడు ప్రధాని ఎంపిక అన్నది బీజేపీకి కష్టమే అవుతుంది. ఎందుకంటే అమిత్ షాను కాదని, మోడీనీ కాదని బీజేపీ కాలు కదపలేదు. అందుకే యోగీని యూపీకి పరిమితం చేసి దేశ రాజకీయాల్లో మళ్లీ తమ హవాను సృష్టించాలని మోడీ,షా ద్వయం భావిస్తోంది.