ఖమ్మంలో ట్విస్ట్‌లు..టీడీపీ సభలో తుమ్మల.!

-

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని విధంగా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ సీట్లు ఇస్తామని ప్రకటించడంతో..జిల్లాలో సీట్లు ఆశిస్తున్న సీనియర్ నేతలు తమదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ బలపడాలని బీజేపీ చూస్తుంది. అటు టీఆర్ఎస్‌తో పొత్తులో జిల్లాలో రెండు సీట్లు అయిన తీసుకోవాలని కమ్యూనిస్టులు చూస్తున్నారు. తమ ఉనికి కాపాడుకోవాలని కాంగ్రెస్ కష్టపడుతుంది.

ఇదే క్రమంలో టీటీడీపీ కూడా యాక్టివ్ అయింది..కొత్త అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ డిసెంబర్ 21న ఖమ్మంలో భారీ సభకు ప్లాన్ చేశారు. ఆ సభకు చంద్రబాబు హాజరు కానున్నారు. అలాగే జిల్లాలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్ళి రాజకీయం నడిపిస్తున్న సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేస్వెరరావు రాజకీయం అర్ధం కాకుండా ఉంది. ఇటీవల కాలంలో ఆయన పాత టీడీపీ వాళ్ళని ఎక్కువ కలుస్తున్నారు. టీడీపీ నేతల ఇళ్లకు వెళుతున్నారు.

అలాగే గతంలో ఎన్టీఆర్, చంద్రబాబులతో పనిచేసిన అనుభవాలని చెబుతున్నారు. అప్పటిలో జిల్లా అభివృద్ధి కోసం కృషి చేశానని అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ సైతం జిల్లా అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని చెబుతున్నారు. ఇలా తుమ్మల అందరినీ పొగిడే పనిలో ఉన్నారు. తాజాగా టీడీపీ సభలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లి కొత్తూరు గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమానికి టీడీపీ నాయకుల ఆహ్వానం మేరకు తుమ్మల హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీచేస్తానని, తనకు రాజకీయ జీవితం ఇచ్చిన దేవుడు నందమూరి తారక రామారావు అని, ఆయనిచ్చిన అవకాశంతోనే ముగ్గురు సీఎంల వద్ద మంత్రిగా పని చేసే అవకాశం వచ్చిందని, ఇక పార్టీకి అతీతంగా.. ఎన్టీఆర్‌ సాక్షిగా తనకు మద్దతు ఇచ్చి గెలిపిస్తానన్నందుకు తెలుగుదేశం శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. అటు టీడీపీ శ్రేణులు సైతం తుమ్మల గెలుపు కోసం పనిచేస్తామని చెప్పారు. దీంతో జిల్లా రాజకీయాల్లో కన్ఫ్యూజన్ మొదలైంది..అసలు తుమ్మల సీటు గ్యారెంటీ లేదు..అయినా పోటీ చేస్తానని అంటున్నారు..ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో చెప్పడం లేదు..అటు టీడీపీ వాళ్ళు ఏమో సపోర్ట్ చేస్తాం అంటున్నారు. తుమ్మల రాజకీయ ఏంటి అనేది అర్ధం కాకుండా ఉంది. మరి త్వరలో చంద్రబాబు సభ ఉన్న నేపథ్యంలో తుమ్మల ఊహించని ట్విస్ట్ ఏమైనా ఇస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news