కరోనా దెబ్బతో భారత్ లో అడాల్సిన క్రికెట్ మ్యాచ్ లు యూఏఈకి తరలించాల్సి వస్తుంది. గతేడాది ఐపీఎల్ (IPL) యూఏఈలోనే జరగగా… ఈ ఏడాది కరోనా కారణంగా మధ్యలో వాయిదా పడిన ఐపీఎల్, భారత్ లో జరగాల్సిన ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌లు కూడా యూఏఈలోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ మ్యాచ్‌లు సెప్టెంబర్-అక్టోబర్‌లో జరగనుండగా… ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ మొదలవనుంది.
అయితే యూఏఈ వేదికగా వెంట వెంటనే ఐపీఎల్, టీ20 ప్రపంచకప్‌లు నిర్వహించడంపై దక్షిణాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ స్పందించాడు. యూఏఈలో ఎక్కువ మైదానాలు లేవని.. దీంతో ఐపీఎల్ ఆడడం వల్ల అక్కడి పిచ్‌లు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశాడు. ఐపీఎల్ తర్వాత పిచ్‌లు తేమ కోల్పోయి డ్రైగా తయారవుతాయని దీంతో ఎక్కువ స్కోర్లు నమోదయ్యే వీలు ఉండదని పేర్కొన్నాడు. పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలిస్తుందని, స్కోర్లు కూడా తక్కువగా నమోదవుతాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. బ్యాట్స్‌మెన్‌కు పరిస్థితులు కష్టంగా మారుతాయని, అలాంటి పరిస్థితుల్లో ఆడాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలని వ్యాఖ్యానించాడు.