బ్రిటన్‌లో పాలక కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవికి.. తద్వారా ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న రిషీ సునాక్, లిజ్ ట్రస్‌లు పార్టీ ఓటర్ల (సభ్యుల) ఆదరణను చూరగొనడానికి నడుం బిగించారు. వచ్చేవారం నుంచి పార్టీ ఓటర్లకు బ్యాలెట్ పత్రాలు పంపనున్న నేపథ్యంలో కన్జర్వేటివ్ ప్రచార కార్యాలయం ఉత్తర ఇంగ్లాండ్‌లోని లీడ్స్ నగరంలో గురువారం రాత్రి ఓటర్లతో సునాక్, ట్రస్‌లతో ముఖాముఖిని నిర్వహించింది. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలతోపాటు సభ్యుల మద్దతునూ చూరగొన్నవారే దేశ ప్రధాని అవుతారన్న సంగతి తెలిసిందే.
కాగా ముఖాముఖిలో పార్టీ ఓటర్లు సునాక్, ట్రస్‌ల విధానాలపై గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. పార్టీలో ఇప్పటికీ బోరిస్ జాన్సన్ పట్ల పలువురు ఆదరణ చూపిస్తున్నట్లు దీనిద్వారా అవగతమవుతోంది. ‘‘ఆర్థిక మంత్రి పదవికి ఉన్నఫళానా రాజీనామా చేయడం ద్వారా మీ నాయకుడు జాన్సన్‌కు వెన్నుపోటు పొడిచారని కొందరు అభిప్రాయపడుతున్నారు’’ అని ఓ ఓటరు సునాక్‌ను ఉద్దేశించి అడిగారు. దీన్ని ఖండిస్తూ సునాక్ సమాధానమిచ్చారు. ఆర్థిక విధానాలపై తమ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడం వల్లనే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరించారు.
అలాగే ‘‘ఆర్థిక మందగమనం, పెరిగిన జీవనవ్యయం ఇబ్బంది పెడుతున్నాయి. వీటిని ఎలా పరిష్కరిస్తారు?’’ అని అభ్యర్థులిద్దరినీ కొందరు ప్రశ్నించారు. ఈతరం సుఖంగా జీవించడానికని పన్నులను భారీగా తగ్గించి భావితరాల భవిష్యత్తును తాకట్టుపెట్టలేనని సునాక్ ప్రకటించారు.
ట్రస్ మాత్రం ప్రధానమంత్రి పదవి స్వీకరించిన వెంటనే పన్నులను భారీగా తగ్గించేస్తానని వాగ్దానం చేశారు. వచ్చే సోమవారం నాడు అభ్యర్థులిద్దరూ నైరుతి ఇంగ్లాండ్ లోని ఎక్సెటర్‌లో పార్టీ ఓటర్ల ముందుకెళతారు. ప్రస్తుత పరిస్థితుల్లో సునాక్‌కు ఎంపీల మద్దతు ఉన్నా పార్టీ ఓటర్లలో ఆయన ప్రత్యర్థి లిజ్ ట్రస్ వైపు కొంత మొగ్గు ఉన్నట్లు తెలుస్తోంది.