వయసు పెరగడాన్ని ఎవ్వరూ నిరోధించలేరు. అందరికీ వయసు పెరుగుతారు. దాన్నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. కానీ ఎంత వయసు పెరుగుతున్నా చూసే వాళ్ళకు ఆ వయసు తాలూకు ఛాయలు కనిపించకుండా యవ్వనంగా కనిపించేందుకు కొన్ని చర్మ సంరక్షణ చర్యలు పాటించాల్సి ఉంటుంది. పొద్దున్న పూట అరగంట వ్యాయామంతో పాటు మంచి నిద్ర యవ్వనంగా ఉంచడంలో సాయపడతాయి. అవే కాకుండా యవ్వనాన్ని ఎప్పటికీ మీ వద్దే ఉంచడానికి కొన్ని చిట్కాలు బాగా పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడే తెలుసుకుందాం.
సూర్యుడి నుండి కాపాడుకోండి
యవ్వనాన్ని అలాగే ఉంచడంలో సన్ స్క్రీన్ లోషన్ పాత్ర చాలా ఉంది. మచ్చలు ఏర్పడకుండా చేసేందుకు ఉపయోగపడడమే కాకుండా ముడుతలు కలగకుండా చూసుకుంటుంది. అందుకే ఎస్ పీ ఎఫ్ 30 ఉన్న సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లో ఉన్నప్పటికీ ల్యాప్ టాప్ వాడేవారు సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకోవడం ఉత్తమం.
నిద్ర
నిద్ర వల్ల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. శరీరం తనని రిపేర్ చేసుకునే సమయం అది. అందువల్ల కనీసం 7 నుండి 9గంటల నిద్ర చాలా అవసరం. నిద్ర తక్కువైతే దానివల్ల అనవసర ఇబ్బందులు తలెత్తి అవన్నీ వయసు పెరిగే ఛాయలు ఏర్పడడంలో సాయపడతాయి.
ఆరోగ్యకరమైన ఆహారం
మీరేం తింటున్నారేది మీరెలా ఉన్నారనేది సూచిస్తుంది. భోజన పళ్ళెంలో ఆకు కూరలు, కూరగాయలు చేర్చుకోండి. ఏది ఎంత తినాలి? ఎందుకు తినాలనేది మీకు తెలియాలి. యాంటీ ఆక్సిడెంట్లు గల ఆహారాలను తీసుకోవడంలో చర్మ మృదుత్వం పెరుగుతుంది.
తేమ
వయసు పెరుగుతున్న కొద్దీ చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేయడం మర్చిపోవద్దు. మాయిశ్చరైజర్ కారణంగా చర్మం తేమగా ఉంటుంది. దానివల్ల చర్మంపై ఎలాంటి ముడుతలు ఏర్పడవు.