తెలంగాణ నిరుద్యోగుల‌కు వ‌రం.. ఏప్రిల్ నుంచే నెల నెలా రూ.3016 నిరుద్యోగ భృతి..?

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇటీవ‌లే జ‌రిగిన ఎన్నిక‌లకు ముందు నిరుద్యోగ యువ‌త‌కు చెప్పిన‌ట్లుగానే.. వారికి నిరుద్యోగ భృతి అందివ్వ‌నున్నారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తామ‌న్న కేసీఆర్ ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి త్వ‌ర‌లోనే ఆ పథ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు. ఈ మేర‌కు తాజాగా ఆయ‌న అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్‌లో నిరుద్యోగ భృతి కోసం రూ.1810 కోట్ల‌ను కేటాయించిన‌ట్లు తెలిపారు. ఈ క్ర‌మంలో రానున్న ఏప్రిల్ నెల నుంచి రాష్ట్రంలోని నిరుద్యోగ యువత‌కు నిరుద్యోగ భృతిని అందించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

కాగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 14 ల‌క్ష‌ల మంది వ‌ర‌కు నిరుద్యోగులు ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తుండ‌గా, లెక్క తేలితే ఆ సంఖ్య 20 ల‌క్ష‌ల‌కు పైనే ఉంటుంద‌ని తెలిసింది. ఈ క్ర‌మంలో వారందరికీ నెల నెలా రూ.3016 ను భృతి కింద అందిస్తారు. అయితే రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఎంత మంది నిరుద్యోగులు ఉన్నార‌నే విష‌యంపై ఇంకా క‌చ్చిత‌మైన స‌మాచారం లేదు. అధికారికంగా నిరుద్యోగుల సంఖ్య‌ను తేల్చాలంటే అందుకు కొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది.

కాగా నిరుద్యోగ భృతిని యువ‌త‌కు ఎలా అంద‌జేయాలి, అందుకు గాను వారికి ఉండాల్సిన అర్హ‌త‌లు ఏమిటి ? అనే అంశాల‌ను ఖ‌రారు చేసేందుకు ఇప్ప‌టికే అధికారులు క‌స‌ర‌త్తు ప్రారంభించారు. ఈ మేర‌కు సీఎం కేసీఆర్ అధికారుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌రాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డం కోసం విదేశాల్లో అమ‌ల‌వుతున్న ఇలాంటి ప‌థ‌కాల‌నే అధికారులు అధ్య‌యనం చేస్తున్నారు.

అయితే ముందుగా జ‌న‌వ‌రి నుంచే నిరుద్యోగ భృతి ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించాల‌ని సీఎం కేసీఆర్ భావించార‌ట‌. కానీ వీలు కాలేదు. దీంతో ఏప్రిల్ నెల నుంచైనా ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని ఆయ‌న ఆలోచిస్తున్నారు. అయితే పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గనున్న నేప‌థ్యంలో ఒక వేళ ఎన్నిక‌ల కోడ్ అమ‌లులోకి వ‌స్తే మాత్రం ఈ ప‌థ‌కం మ‌రింత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే ఈ ప‌థ‌కాన్ని పొందాల‌నుకునేవారు ఆన్‌లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంద‌ని తెలిసింది. విద్యార్హ‌త‌ల‌కు చెందిన స‌ర్టిఫికెట్ల స్కానింగ్ కాపీల‌తోపాటు ఆదాయ‌, కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు, ఆధార్ కార్డు, ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్ నంబ‌ర్, పాన్ కార్డు, బ్యాంకు అకౌంట్ వివ‌రాల‌ను అభ్య‌ర్థులు ఇవ్వాల్సి ఉంటుంద‌ని తెలుస్తోంది..!

Read more RELATED
Recommended to you

Latest news