తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింప్ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. ఈ కేసులో బాధితులుగా ఉన్న వారి నుంచి వివరాలను సేకరించేందుకు సిట్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు నోటీసులు ఇచ్చి.. వారి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ముందస్తు షెడ్యూల్ కారణంగా సిట్ విచారణకు బండి హాజరు కాలేదు.
దీంతో మరోసారి నోటీసులు ఇచ్చారు. అయితే రెండోసారి వచ్చిన నోటీసులపై ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ.. సిట్ అధికారులకు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు సిట్ విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేశారు. రేపు పార్లమెంట్ లో ఆపరేషన్ సిందూర్ పై చర్చ జరుగుతున్న కారణంగా విచారణకు రాలేనని.. త్వరలోనే సిట్ విచారణకు హాజరయ్యే తేదీని తెలియజేస్తానని ఈ సందర్బంగా ఎంపీ బండి సంజయ్ తన లేఖలో రాసుకొచ్చారు.