యూపీలో జంగల్ రాజ్ నడుస్తోంది. – అఖిలేష్ యాదవ్.

యూపీ లఖీంపూర్ ఖేరీ ఘటన ప్రకంపనలు స్రుష్టిస్తోంది. ప్రతిపక్షాలు, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఘటనకు కారణం కేంద్రమంత్రి కొడుకు ఆశిష్ మిశ్రానే అని ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా సుప్రీం మొట్టికాయలు వేయడంతో ఆశిష్ మిశ్రాను విచారణ నిమిత్తం అధికారులు పిలిచారు. దీనిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమాజ్ వాది పార్టీ నేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా యూపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యూపీలో జంగల్ రాజ్ పాలన నడుస్తుందని విమర్శించారు. 

కేంద్రమంత్రి కొడుకు ఆశిష్ మిశ్రాకు సమన్లు కాదు సన్మానం చేస్తున్నారని విమర్శించారు. లఖీంపూర్ ఖేరీలో రైతు చట్టాలను రద్దు చేయాలని నిరసన చేస్తున్న రైతులకు పైకి కాన్వాయ్ వాహనాలు వెళ్లడంతో రైతులు మరణించిన విషయం తెలిసిందే. దీనిపై ఇటు సమాజ్ వాది పార్టీ, మరోవైపు కాంగ్రెస్ బీజేపీ, యూపీ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. మొన్న ప్రియాంక, రాహుల్ గాంధీ పర్యటనతో పాటు పంజాబ్ పీసీసీ ఛీఫ్ సిద్ధూ నిరహార దీక్షతో ప్రభుత్వంపై ఒత్తడి తీసుకువస్తున్నారు. తాజాగా ఆశిష్ మిశ్రా విచారణకు హాజరుకావడంతో సిద్ధూ నిరాహార దీక్ష విరమించాడు.