ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవడంతో సంస్థల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. దీంతో సంక్షోభం నుంచి బయటపడేందుకు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి కంపెనీలు. తాజాగా అమెరికా వ్యాపార దిగ్గజం డిస్నీ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని థీమ్ పార్కులో 28వేల మందిని తొలగించేందుకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా…ప్రకటన విడుదల చేసింది. ఎంతో ఆవేదనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది డిస్నీ సంస్థ.
తమ వ్యాపారాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపడంతో ఉద్యోగుల్లో నాలుగవ వంతును తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు డిస్నీ పార్క్ చైర్మన్ జోష్ డీ అమారో. ఇందులో 67శాతం మంది తాత్కాలిక ఉద్యోగులే ఉన్నారన్నారు. గత కొన్ని నెలలుగా ఉద్యోగులు ఎవరినీ విధుల నుంచి తొలగించకుండా ఉండేందుకు ప్రయత్నించామని చెప్పారు. నష్టాల నుంచి బయటపడేందుకు కొన్ని ఖర్చులు తగ్గించడంతో పాటు చాలా కార్యక్రమాలను నిలిపివేశామన్నారు. అయినా నష్టాలు తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.