తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్నన్ని వివాదాలు ఇంకే పార్టీలో ఉండవనే చెప్పాలి. ఆ పార్టీలో సొంత నేతలపైనే విమర్శలు చేస్తూ ఉంటారు అగ్ర నేతలు. ఇదే వారికి పెద్ద మైనస్ గా తయారైంది. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ ఎంపికపై ఇదే జరుగుతోంది. ఎప్పుడైతే రేవంత్‌రెడ్డి కి ఇస్తారనే ప్రచారం జరుగుతుందో అప్పటి నుంచి సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు ఆయనపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.
అంతే కాదు ప్రెస్‌మీట్లు పెట్టి రేవంత్‌కు ఇవ్వొద్దని పట్టు పడుతున్నారు. దీంతో ఈయన ముందుకు రావడంతో ఇంకా చాలామంది రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వారు ముందుకు వచ్చారు. వారు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఢిల్లీకి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసి అధినాయకత్వాన్ని ఆలోచనలో పడేశారు.
దీంతో ఢిల్లీ నాయకత్వం కూడా తమ నిర్ణయాన్ని చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టి షాక్ ఇచ్చింది. రేవంత్ ఇతర పార్టీ నుంచి రావడంతో అలాంటి వారికి పార్టీ పగ్గాలు ఎలా అప్పగిస్తారంటూ వీహెచ్, ఇతర నేతలు చేసిన ఫిర్యాదులే రేవంత్‌కు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారాయి. దీంతో రేవంత్ కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ పెద్దలను ఒప్పించేందుకు శథవిధాలా ప్రయత్నిస్తున్నారు.