కరోనా కట్టడి ఇప్పట్లో కష్టమేనని తేలడంతో గత ఏడు నెలలుగా షూటింగ్‌లకు దూరంగా వుంటున్న స్టార్స్ అంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ సినిమాల షూటింగ్స్ మొదలుపెట్టారు. కొంత మంది మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్, బెల్లంకొండ శ్రీనివాస్, వైష్ణవ్ తేజ్ ఇప్పటికే తమ చిత్రాల షూటింగ్‌లు మొదలుపెట్టేశారు.
ఇదే ఊపులో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం `వకీల్‌సాబ్` షూటింగ్ కూడా పునః ప్రారంభం అయ్యింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజుతో కలిసి బోనీకపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోర్టు డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన కీలక కోర్టు ఘట్టాలని లాక్‌డౌన్ బిఫోరే అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన ప్రత్యేక కోర్టు సెట్‌లో పూర్తి చేశారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ సోమవారం రాత్రి హైదరాబాద్‌లో మొదలైంది.
అయితే పవర్‌స్టార్ లేకుండానే షూటింగ్‌ని మొదలుపెట్టారు. కీలక నటీనటుల నేపథ్యంలో కోర్టు హాలుకు సంబంధించిన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. పవన్ వచ్చేనెల మొదటి వారం లేదా రెండవ వారంలో సెట్ లోకి ఎంటర్ కానున్నారట. అప్పుడే పలు కీలక సన్నివేశాలతో పాటు శృతిహాసన్, పవన్‌లపై ఓ పాటతో పాటు ఓ ఫైట్‌ని షూట్ చేస్తారట. నవంబర్ వరకు షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ లో ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తున్నారు.