దేవాలయాల దాడులకు సంబంధించిన ప్రస్తావనలో దోషులను అరెస్ట్ చేసినట్లు చెప్పిన డీజీపీ, పార్టీల ప్రమేయం ఉందని చెప్పడం రాష్ట్రప్రజానీకాన్ని ఆశ్చర్యచకితుల్ని చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు. డీజీపీ ఏ సమాచారంతో మీడియాతో మాట్లాడారు? సీఐడీ, సిట్ సంస్థలు ఇచ్చిన సమాచారంతోనా లేక సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన సమాచారంతో మాట్లాడారా? అని ఆయన ప్రశ్నించారు.
13వ తేదీన మాట్లాడిన డీజీపీ ఏ పార్టీకి సంబంధం లేదని చెప్పి, 15వ తేదీన మాట్లాడుతూ, రాజకీయపార్టీలకు సంబంధించిన వారి ప్రమేయం ఉందని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఏ డీజీపీకూడా మాట్లాడని విధంగా ఆయన అధికారపార్టికి వత్తాసుపలుకుతూ దిగజారి మాట్లాడారని ఆయన అన్నారు. డీజీపీ వ్యాఖ్యలను, ఆయన విధినిర్వహణ తీరుని ఐపీఎస్ అధికారుల సంఘం కూడా సమర్థించదని ఒకవేళ అలా సమర్థించినట్టయితే, డీజీపీని ఉద్దేశించి ఇకపై తాను మాట్లాడనని ఆయన అన్నారు.