అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని ఇవాళ ఏపీ హై కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ తీర్పుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ప్రభుత్వం తరఫున స్పందించారు. హై కోర్టు తీర్పును పూర్తిగా పరిశీలించాల్సి ఉందని.. 13 జిల్లాలను, మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే కాంక్షతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని వివరించారు.
గతంలో కొంత మంది స్వార్ధపూరితంగా అన్నీ ఇక్కడే కేంద్రీకరించి వాళ్ల భూములకు రేట్లు పెంచుకునే ప్రయత్నం చేశారని.. ప్రజలకు ఏది మంచి జరుగుతుందో దాని ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పారు. అవసరమైతే సుప్రీం కోర్టుకు అప్పీలుకు వెళతామని.. ఆరు నెలల సమయంలో అభివృద్ధి చేయాలంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కూడా చూసుకోవాల్సి ఉంటుందని ప్రకటన చేశారు.
అమరావతి ప్రాంతంలో అభివృద్ధి జరుగుతూనే ఉందని.. చంద్రబాబు వేసింది కేవలం శ్లాబులేనని వెల్లడించారు. తమ ప్రభుత్వం ఏ రైతుకూ అన్యాయం చేయదని.. రైతుల ముసుగులో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకే ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చాయన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.