వీఎఫ్​ఎక్స్​ మ్యాజిక్​.. రూ.500కోట్ల బడ్జెట్​​తో స్టార్​ హీరోలు.. హిట్​ కొడతారా?

-

భారత చిత్రసీమలో పరిస్థితులు మారిపోయాయి. ఇండియన్​ సినిమా బడ్జెట్ భారీగా​ పెరిగిపోయింది. ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకునేందుకు ఈ భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తున్నారు. ‘ఆర్​ఆర్​ఆర్’, ‘కేజీయఫ్​’ వంటి బిగ్ రేంజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాక ఈ ఒరవడి మరింత పెరుగుతోంది. దీంతో బాలీవుడ్​, టాలీవుడ్, కోలీవుడ్​​ అని తేడా లేకుండా.. అని భాషల్లో అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తూ.. బడ్జెట్​ పెట్టడానికి ఏమాత్రం వెనకాడట్లేదు దర్శకనిర్మాతలు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలైతే కనీసం రూ.100 నుంచి రూ.500కోట్ల పెట్టుబడితో తెరకెక్కుతున్నాయి. ఇక విజువల్​ ఎఫెక్ట్స్​ ( వీఎఫ్​ఎక్స్​) విషయానికొస్తే.. అసాధ్యం అనుకున్న సీన్స్​ను సుసాధ్యం చేసే సాధనం. ఒకప్పుడు విజువల్​ ఎఫెక్ట్స్​ అంటే హాలీవుడ్​కే పరిమితం అయ్యేవి. కానీ ఇప్పుడు 24 క్రాఫ్ట్స్​లో అది కూడా ఒక భాగం అయిపోయింది. ఈ భారీ బడ్జెట్​ సినిమాల్లో సగం ఖర్చు దీని కోసమే కేటాయిస్తున్నారు. ఇప్పటికే ఈ వీఎఫ్​ఎక్స్​లతో కూడిన వచ్చిన పెద్ద బడ్జెట్​ సినిమాలు కొన్ని సూపర్​ హిట్​ అవ్వగా కొన్ని ఆకట్టుకోలేకపోయాయి. రీసెంట్​గా వచ్చిన ‘పృథ్వీరాజ్’​, ‘షెంషేరా’ కూడా ఆడలేదు. అయితే త్వరలోనే ఈ వీఎఫ్​ఎక్స్ సాంకేతికతో రానున్న​ బడా ప్రాజెక్ట్స్​ ఏంటి? ఆ చిత్ర సంగతులేంటో తెలుసుకుందాం…

బ్రహ్మాస్త్ర.. రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా.. బాలీవుడ్​లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రహ్మస్త్ర’. మూడు పార్ట్‏లుగా రానున్న ఈ చిత్రంలో కింగ్​ నాగార్జున కీలక పాత్ర పోషించారు. ట్రైలర్​లోని ప్రతి సీన్ విజువల్ వండర్ ఎఫెక్ట్‏గా కనిపిస్తోంది. రూ. 300 కోట్లకుపైగా బడ్జెట్​తో రూపొందిన ఈ చిత్రంలో వీఎఫ్​ఎక్స్​ ఈ సినిమాకి అత్యంత కీలకం కానుంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్-డీసీ కామిక్స్ రూపొందించిన సినిమాల తరహాలో ప్రయత్నమిది. వీక్షకులకు భారతదేశపు మొట్టమొదటి అసలైన విశ్వం – ఆస్ట్రావర్స్​ను పరిచయం చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. తొలి భాగాన్ని 2022 సెప్టెంబర్ 9న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

పొన్నియన్ సెల్వన్.. చాలా సంవత్సరాల తర్వాత మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. రెండు భాగాలు వస్తున్న ఈ సినిమా తొలి భాగం సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌, నటీనటుల ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. పీరియాడికల్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతోంది. రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్​లో ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ , కార్తి , త్రిష, జయం రవి, ప్రకాశ్‌ రాజ్‌, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ్ల, ప్రభు తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐదు భాషల్లో విక్రమ్‌ స్వయంగా డబ్బింగ్‌ చెప్పటం విశేషం. ఏఆర్ రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఆదిపురుష్.. పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ఓంరౌత్ రూపొందిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్ 3డి’. రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ పీరియాడికల్ డ్రామా 400 కోట్ల భారీ బడ్జెట్​తో రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రభాస్- కృతి సనన్- సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. భారీ పెట్టుబడికి కారణం విస్తృతమైన వీఎఫ్​ఎక్స్​ ఉండటమే. దీనికోసం మేకర్స్ హాలీవుడ్ సాంకేతిక నిపుణులను బరిలో దించారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి.

టైగర్ 3.. విజయవంతమైన టైగర్ ఫ్రాంచైజీ నుంచి టైగర్ 3.. రూ 225 కోట్ల బడ్జెట్​తో రూపొందుతోంది. సల్మాన్ ఖాన్- కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్షన్ చిత్రం 2023 ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

బడే మియాన్ చోటే మియాన్ 2.. 300 కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందిస్తున్న ‘బడే మియాన్ చోటే మియాన్ 2’ లో అక్షయ్ కుమార్- టైగర్ ష్రాఫ్ కథానాయకులు. సామ్రాట్ పృథ్వీరాజ్- హీరోపంతి 2 బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన తర్వాత ఈ సినిమాపైనే ఆ ఇద్దరి హోప్స్. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వాషు భగ్నాని నిర్మిస్తున్నారు.

పఠాన్.. గతనాలగేళ్లుగా వెండితెరకు దూరమైన బాలీవుడ్​ బాద్​ షా షారుక్ ఖాన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పఠాన్’. ఫ్లాప్​ల్లో ఉన్న ఆయన దీనిపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. యశ్​ రాజ్ ఫిల్మిస్​ రూపొందిస్తోంది. 250 కోట్ల బడ్జెట్​తో దీన్ని నిర్మించారు. సల్మాన్​ ఖాన్ గెస్ట్ రోల్​ చేస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానుంది.

భారతీయుడు 2.. శంకర్​-కమల్​హాసన్​ కాంబోలో రానున్న చిత్రం ఇది. ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిచిపోయిన ఈ ప్రాజెక్ట్​ ఖర్చు రూ.200కోట్లు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. కమల్ హాసన్ ఇప్పటికే ‘విక్రమ్’తో బ్లాక్ బస్టర్ అందుకుని హుషారుగా ఉన్నారు. ‘భారతీయుడు 2’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక అల్లు అర్జున్​-సుకుమార్​ కాంబోలో రూపొందనున్న ‘పుష్ప 2’ కోసం రూ.400కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిసింది. త్వరలోనే సెట్స్​పైకి వెళ్లనుంది. మరి ఇందులో ఏ మేరకు వీఎఫ్​ఎక్స్​ వినియోగిస్తారో తెలీదు. కాగా, భారీ వీఎఫ్​ఎక్స్​ హంగులతో రానున్న ఈ బడా ప్రాజెక్ట్​లన్నీ మరి ఈ మేరకు ప్రేక్షకుల్ని అలరిస్తాయో చాడాలి.

Read more RELATED
Recommended to you

Latest news