భారత ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చురకలంటించారు. ఇటీవల రాహుల్ బ్రిటన్లో పర్యటించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ధన్‌ఖడ్ స్పందించారు. విదేశీ పర్యటనకు బయల్దేరే ముందు దేశ పౌరులు తమ రాజకీయ కళ్లజోళ్లను తీసేయాలని, తద్వారా వ్యక్తిగతంగా వారికి, దేశానికీ మంచిదని వ్యాఖ్యానించారు.
ఇటీవల బ్రిటన్లో పర్యటించిన రాహుల్ గాంధీ.. భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ ఆరోపించిన నేపథ్యంలో.. ఆయన పేరు ప్రస్తావించకుండానే ధన్‌ఖడ్ ఈ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఏ విదేశీయుడూ భారతదేశానికి వచ్చి తమ దేశ గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడరని ప్రస్తావించారు.
రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగి గత పార్లమెంట్ సమావేశాలు దాదాపు తుడుచుపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. ధన్‌ఖడ్ ఇప్పటికే రాహుల్ వాఖ్యలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా ఈ సదస్సులో మాట్లాడుతూ 2047లో నిర్వహించుకోబోయే వందేళ్ల స్వాంతంత్య్ర వేడుకలకు బలమైన పునాదులు వేయాల్సిందిపోయి, విదేశాల్లో దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం తగదని అభిప్రాయపడ్డారు.