ఏపీలో మరో మహిళా నేత వైసిపి హై కమాండ్కు తలనొప్పిగా మారారు. నియోజకవర్గంలో మిగతా వైసీపీ శ్రేణులకు ఆమె పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అటు స్థానిక ఎమ్మెల్సీ, ఎంపీ తో ఆమెకు పొసగడం లేదు. వర్గాలను ప్రోత్సహిస్తూ పార్టీని నిర్వీర్యం చేస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.దీంతో హై కమాండ్ దిద్దుబాటు చర్యలకు దిగింది. స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా దక్కడం డౌటేనని తేల్చేసింది. ఇంతకీ ఆ నేత ఎవరంటే మంత్రి విడదల రజనీ.
మంత్రి విడదల రజినిపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల పనితీరుపై నరసారావుపేటలో సమీక్ష నిర్వహించారు. మంత్రి విడదల రజని, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విడదల రజిని ప్రాతినిథ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గంపై చర్చ సాగిందని తెలుస్తోంది. ఇక్కడ ఎమ్మెల్సీ రాజశేఖర్, జాన్ సైదా వర్గాలను వేరుచేసి పార్టీకి నష్టం చేస్తున్నారని మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.