సోషల్ మీడియాలో పిచ్చివాగుడుకు చట్టపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మ ఒడి వాహనమిత్ర పథకాలను రద్దు అవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక ప్రసార శాఖ పేరుతో ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన సీఐడీ పోలీసులు, ఈ ఫేక్ న్యూస్ ను సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలకు శ్రీకారం చుట్టారు.
అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నేతలు పలువురికి ఈ వ్యవహారంపై నోటీసులు అందించారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్య అనుచరుడుని అదుపులోకి తీసుకున్న పోలీసులు సీఐడీ కార్యాలయంలో అతడిని విచారించారు. ఆ తర్వాత గౌతు శిరీష కు, తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురుకి, విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో వారు సైతం విచారణ ఎదుర్కొన్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రశ్నించే గొంతులను నొక్కెయాలని అధికార వైసిపి ప్రయత్నం చేస్తోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సోషల్ మీడియా పోస్టులపై రచ్చ కొనసాగుతుంటే.. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా తనదైన శైలిలో స్పందించారు.
ప్రభుత్వ చిహ్నంతో సోషల్ మీడియాలో నకిలీ పోస్టులు పెడితే సన్మానాలు చేస్తారా..? గ్రీష్మ, శిరీష, అనిత, పట్టాభి, అయ్యన్న మరి ఎవరైన …. అందరికీ ఒకటే చట్టం. చట్టానికి కుటుంబ నేపథ్యం, లింగ భేదం ఉండదు. పిచ్చి వాగుడుకు చట్టపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 7, 2022