కేసీఆర్, హరీష్ రావులపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సర్కార్ వైద్యరంగాన్ని తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేస్తోంది. పెద్దపల్లి జిల్లాలో రెండు ఎంసీహెచ్‌లు ప్రారంభించి ఆరు నెలలు గడిచినా ఇప్పటికీ పూర్తి స్థాయిలో డాక్టర్లు, సిబ్బంది, పరికరాలు అందుబాటులో లేక రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్దపల్లిలో రూ.17 కోట్లతో 100 పడకల ఎఎంసీహెచ్‌ని నిర్మించారు. ఆరు నెలల క్రితం మంత్రి హరీశ్‌రావు ఈ ఆస్పత్రిని ప్రారంభించారు. పాత బెడ్స్ 84, కొత్తవి 100తో కలిపి మొత్తంగా 184 పడకలు ఉండగా గైనకాలజిస్టులు ఇద్దరు మాత్రమే ఉన్నారు, సరిపడే నర్సులు లేరు. దీంతో వైద్య సేవలు అందించడంలో డాక్టర్లు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నరు. మంథని కేంద్రంగా ఏర్పాటు చేసిన ఎంసీహెచ్ ప్రారంభించిన నెలలోపే మూసేశారన్నారు.
ఇక భారీ వర్షాలతో ఎంసీహెచ్ పూర్తిగా మునిగిపోయింది. దీంతో పేషెంట్లను పాత ఆస్పత్రికి తరలించి, ఎంసీహెచ్‌కు తాళాలు వేశారు. మూడు నెలలైనా మరమ్మతులు చేయలేదు. ఎంసీహెచ్‌లో అవసరమైనన్ని గదులున్నా 6 బెడ్స్ వేయాల్సిన గదుల్లో 10 బెడ్స్ వేసి ట్రీట్మెంటు ఇస్తున్నరు. ఇలా గర్భిణీలు అనేక ఇబ్బందులు పడుతున్నరు. పెద్దపల్లి జిల్లాలోనే కాదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఏం కేసీఆర్… వైద్యరంగానికి పెద్ద పీట వేస్తామని చెప్పడమేనా? చేతల్లో మాత్రం చూపించవా? పేదల జీవితాలతో ఆడుకుంటున్న ఈ కేసీఆర్ సర్కార్‌కు తెలంగాణ ప్రజానీకం తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు విజయ శాంతి.