భాగ్యనగరాన్ని వరుణుడు వీడనంటున్నాడు. గత రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుసింది. ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో వర్షం నగరవాసులను పలకరిస్తూనే ఉంది. ఆదివారం ఉదయం ఒక్కసారిగా వర్షం కురిసింది. అయితే వాన కొద్దిసేపే పడినప్పటికీ రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్, కూకట్‌పల్లి, బాలానగర్, బోయిన్‌పల్లి, సికింద్రాబాద్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, కోఠి, మెహదీపట్నంలో వర్షం కురిసింది. ఇక రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వాన కురుస్తున్నది.
మరో మూడురోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అయితే ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అయితే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే.. మరో మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అవసరం ఉంటేనే బయటకు రావాలని సూచిస్తున్నారు అధికారులు.