గవర్నర్ విషయంలో..కోర్టు.. కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పిందని విమర్శలు చేశారు విజయ శాంతి. రాజ్యాంగం పట్ల, చట్టపరమైన విధుల పట్ల మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏపాటి గౌరవం ఉందో… బడ్జెట్ సమావేశాల విషయంలో ఆయన అనుసరించిన వ్యవహారశైలితో బాగా అర్థమైంది. బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ఆమోదం ఇవ్వలేదంటూ ఈ సర్కారు కోర్టుకెక్కడం యావత్ ప్రభుత్వ యంత్రాంగానికే తలవంపుల్లాంటిదన్నారు.
బడ్జెట్ సమావేశాలకు ఆమోదముద్ర వేసేందుకు గవర్నర్ గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టే, తమ ప్రసంగానికి సంబంధించిన వివరాల కోసం అడిగారు. అందుకు ప్రభుత్వం స్పందించక ఎప్పటిలాగే గవర్నర్ గారిని మరోసారి అవమానించాలని భావించి, కోర్టుకెళ్లి భంగపడింది. చివరికి బడ్జెట్ సమావేశాల తేదీ కూడా మార్చుకునే ఆలోచన చెయ్యాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా గవర్నర్‌ను విమర్శించొద్దన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని లాయర్ దుష్యంత్ దవే చెప్పాల్సి రావడం అత్యంత దురదృష్టకరమని వెల్లడించారు.
పదే పదే గవర్నర్ గారిని ఎలా అవమానించాలా… అనే ధ్యాస తప్ప ఈ సర్కారుకి మరో పనిలేదని స్పష్టమైంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై సీ-ఓటర్ ఇండియా టుడే నిర్వహించిన సర్వే వెల్లడించిన బెస్ట్ సీఎం జాబితాలో మన సారు సోదిలో కూడా లేకుండా పోయారు. తన బీఆరెస్‌తో ఆయన సాధించేదేంటో ఈ పరిణామం చెప్పకనే చెప్పిందన్నారు విజయ శాంతి.