లక్ష మంది టీఆర్‌ఎస్‌ను వద్దనుకున్నారు అది గుర్తుంచుకోండి..!

-

తెలంగాణలో జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌ విజయం సాధించిన విషయం తెల్సిందే. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ 18,478 ఓట్ల మెజారిటీతో తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై విజయం సాధించారు. ఈ ఎన్నికలో ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యే పోటీ జరిగింది. ఈ ఎన్నికలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు. బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. అయితే ఈ ఫలితాలపై బీజేపీ నేత విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

నాగార్జున సాగర్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపుపై ఆ పార్టీ జబ్బలు చరుచుకోవడం విచిత్రంగా ఉందని అన్నారు. నియోజకవర్గంలోని ఒక లక్ష 89 వేల పైచిలుకు ఓటర్లలో దాదాపు లక్ష మంది టీఆర్‌ఎస్‌ను వద్దనుకున్నారన్న విషయం రుజువైందని వ్యాఖ్యానించారు. అలానే ఈ గెలుపు కోసం ఓటర్లను మభ్యపెట్టేందుకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దాదాపు వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఓటర్లను ఒత్తిడికి గురి చేసిన సంగతి సుస్పష్టమవుతుందని ఆరోపించారు. ఇక అటు రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పైన కూడా విజయశాంతి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి , నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఎంతో చేశారంటూ బలమైన ప్రచారం జరిగినా ఆయన ఓటమి పాలు కావటం గమనిస్తే తెలంగాణ ప్రజలు కచ్చితంగా కాంగ్రెస్‌ని వద్దనుకున్నట్టు ఓటు ద్వారా చెప్పకనే చెప్పారని అన్నారు.

ఇక ఈ ఎన్నికలో బీజేపీ ఓటమిని విజయశాంతి వెనకేసుకొచ్చారు. సాగర్ ఉపఎన్నిక అత్యంత ప్రత్యేక పరిస్థితులలో జరగడమే కాక, సానుభూతి పవనాలు కూడా ప్రభావితం చేశాయన్న విషయాన్ని మర్చిపోకూడదని అన్నారు. ఈ మధ్యనే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, అంతకుముందు జరిగిన దుబ్బాక ఎన్నికలోనూ బీజేపీ సాధించిన విజయం… రాబోయే శాసనసభ ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి ప్రత్యామ్నాయం కమలదళమేనన్న సంకేతాలు వెలువడ్డాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news