ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయాల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. వరుసగా ఏదో ఒక ప్రాంతంలో అర్చకులు ఈ మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా.. విజయవాడ ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ సన్నిధి ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం రేపింది. ఆలయంలోని లక్ష కుంకుమార్చనలో విధులు నిర్వహిస్తున్న అర్చకుడికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ జరిగింది. దీంతో వెంటనే ఆయన్ని పిన్నమనేని ఆసుపత్రికి తరలించారు. అర్చకుడికి పాజిటివ్ అని తేలడంతో ఆలయ ఉద్యోగులలో ఆందోళన నెలకొంది.
కరోనా సోకిన అర్చకుడితో సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలించారు అధికారులు. అయితే గుడికి వచ్చే భక్తులందరూ మహామండపం మీదుగా మెట్ల మార్గంలో కొండపైకి వెళుతున్నారు. భౌతిక దూరం, మాస్క్‌లు, శానిటైజర్ వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా అర్చకుడికి కరోనా రావడంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే అక్కడ పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ నిర్ణయించుకొని.. చివరి క్షణంలో మనుసు మార్చుకొని లాక్ డౌన్ విధించడం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే.