ఉత్తరాంధ్ర ఇలవేల్పు నిన్నటి వేళ నిజరూప దర్శనం ఇచ్చారు. సింహాద్రి వాసుడైన నారసింహుడు చందనోత్సవానికి పూర్వ వైభవం, అపూర్వ ప్రాభవం మళ్లీ మళ్లీ దక్కించారు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ఆలయ ట్రస్ట్ మెంబర్లు. ఇదే సమయంలో ఓ గండం నుంచి గట్టెక్కిన టీడీపీ నేత, మళ్లీ ట్రస్ట్ చైర్మన్ బాధ్యతలు అందుకుని , ఆలయ ట్రస్టీ స్వామిని దర్శించుకుని సభక్తిపూర్వకంగా స్వామిని దర్శించుకుని వెళ్లారు. వాస్తవానికి కొండపైన దేవుడు చుట్టూ ఎన్నో వివాదాలున్నా వాటిని దాటుకునే ఇవాళ అశోక్ కానీ ఇతర రాజకీయవేత్తలు కానీ ఉన్నారు. అయితే జగన్ ఆరాధించే లేదా గురువుగా భావించే శారదా పీఠాధిపతి ఓ మాట చెప్పి వెళ్లిపోయారు. అదే ఇప్పుడు వివాదాలకు కారణం అవుతోంది.
సింహాచలం మహా పుణ్య క్షేత్రం అని చెప్పడంతోనే మొదలవుతుంది ఆ ఆలయ ప్రాశస్త్యం. స్వామి వైభవం నభూతో ! ఇప్పటిదాకా విశాఖకే కాదు ఆంధ్రులకే కాదు తెలంగాణ వారికీ ఆయనే ఇలవేల్పు. ఈ ఆలయ వైభవాన్ని చూసి పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణ గవర్నర్ తమిళ సై ఎంతగానో ముచ్చటపడ్డారు. ఆమె కూడా స్వామిని దర్శించుకుని నిన్నటి చందనోత్సవానికి హాజరయ్యారు. ఎట్టకేలకు అనేక వివాదాలు దాటుకుని ఆలయ ట్రస్టీ చైర్మన్ గా మళ్లీ బాధ్యతలు అందుకున్న అశోక్ గజపతి రాజు
దంపతులు స్వామికి చందనం సమర్పించి, భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. స్వామి నిజరూపదర్శనం ఒక్క చందనోత్సవ వేళ మాత్రమే ఉంటుంది కనుక భక్తులు ఇక్కడికి వేలాదిగా తరలివచ్చారు. ఈ ప్రాంతంతో తమకు ఉన్న అనుబంధాన్ని చాటుకున్నారు. తెలంగాణ నారసింహుడు యాదాద్రీశుడు అయితే, ఆంధ్రా నారసింహుడు సింహాచలేశుడు. ఆయన వైభవం అపూర్వం. కానీ ఓ స్వామీజీ కారణంగానే ఓ వివాదం రేగనుంది. వాస్తవానికి ఆయన ఏ ఉద్దేశంతో చెప్పినా అది తప్పే !
ఆ వివరం ఈ కథనంలో…
మాట జారిన ప్రతిసారీ, మాట తప్పిన ప్రతిసారీ ఏదో ఒక వివాదం ప్రభుత్వాన్ని చుట్టుముడుతోంది. ఆ విధంగా సింహాచలేశుడి కొండ చుట్టూ మరో వివాదం అలుముకోనుంది. వాస్తవానికి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరోనా విలయంలోనూ స్వామికి చందనోత్సవాలు జరిగాయి. అయితే అవన్నీ ఏకాంతంగానే జరిగాయి. అంటే భక్తులను ఎవ్వరినీ అనుమతించలేదు. వైద్యుల సలహా మేరకు గడిచిన రెండేళ్లు చందనోత్సవానికి భారీగా భక్తులను అనుమతించే వీల్లేదు. కనుక వద్దనుకుని కరోనా నిబంధనల మేరకు కొద్దిమంది ఆలయ ట్రస్టీ సభ్యులు, వైదికులు, ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలోనే ఆ రోజు వేడుకలు జరిగాయి. కానీ ఇవేవీ తెలియని లేదా తెలుసుకోని ఓ స్వామిజీ జగన్ ప్రభుత్వాన్ని అత్యంత నిర్దయగా వివాదాల్లోకి నెట్టారు.
ఏటా ఎంతో వైభవోపేతంగా సింహాచలం చందనోత్సవం జరుగుతుంది. విశాఖ నగరికి చెందిన ప్రజలే కాదు చుట్టు పక్కల పరిసర ప్రజలతోపాటు ఉత్తరాంధ్ర నుంచి, ఒడిశా నుంచి కూడా స్వామి దర్శనార్థం తరలివస్తారు. ఏటా జరిగే చందనోత్సవ వైభవం గడిచిన రెండేళ్లుగా జరగడం లేదని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సెలవిచ్చారు. ఇదే ఇప్పుడు వైదికుల్లో చర్చకు తావిస్తోంది. కరోనా విలయ తాండవాన స్వామికి చందనోత్సవం జరగలేదని అంటున్నారాయన. అదే కనుక జరిగితే జగన్ మరో వివాదంలో ఇరుక్కుపోయారనే చెప్పాలి.