సీనియర్ హీరో అర్జున్ సార్జా, యంగ్ హీరో విశ్వక్‌సేన్ మధ్య వివాదం మరింత సీరియస్‌గా మారింది. ప్రెస్‌మీట్ పెట్టి మరీ విశ్వక్‌సేన్‌పై అర్జున్ ఫైర్ అవ్వడం.. అతను ఒక కమిట్‌మెంట్ లేని నటుడు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అంతా దీనిపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అర్జున్‌తో వివాదంపై విశ్వక్‌సేన్ స్పందించాడు. స్వీయ దర్శకత్వంలో అర్జున్ నిర్మిస్తున్న సినిమా నుంచి తాను బయటకు వచ్చేశానని విశ్వక్ చెప్పేశాడు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి తాను తీసుకున్న రెమ్యూనరేషన్,చెక్కులు, డాక్యుమెంట్లను నిర్మాతల మండలికి ఈ పాటికే పంపించి వేశానని కూడా అతడు తెలిపాడు. ఈ మేరకు శనివారం రాత్రి విశ్వక్ ఓ ప్రకటన విడుదల చేశాడు.
తన కుమార్తెను టాలీవుడ్ కు పరిచయం చేస్తూ అర్జున్ నిర్మిస్తున్న చిత్రంలో విశ్వక్ హీరోగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ 3 నెలల క్రితమే ప్రారంభం కాగా… అర్జున్, విశ్వక్ ల మధ్య విభేదాలతో తాజాగా సినిమా ఆగిపోయింది. అర్జున్ తో తనకు నెలకొన్న వివాదంపైనా విశ్వక్ స్పందించాడు. సినిమాలో పాటలు, సంభాషణలు, మ్యూజిక్ గురించి తాను కొన్ని సూచనలు చేసిన మాట వాస్తవమనని విశ్వక్ అన్నాడు. ఆసక్తికరంగా అనిపించిన చిన్న చిన్న మార్పులకు కూడా అర్జున్ అస్సలు అంగీకరించడం లేదని వాపోయాడు. తాను చెప్పినట్లే నడుచుకోవాలంటూ అర్జున్ ఆంక్షలు పెడుతున్నారని తెలిపాడు. సెట్ లో తన మాటకు గౌరవం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కారణంగానే తన మనసుకు నచ్చని పని చేయలేక సినిమా నుంచి బయటకు వచ్చేశానని విశ్వక్ తెలిపాడు.