రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారుల శకం ముగిసింది. రెండేళ్ల కిందటే వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం 5వేల 294 మందిని రెవెన్యూ మినహా ఇతర శాఖలకు లాటరీ ద్వారా పంపింది. సోమవారం రాత్రి వరకు ప్రక్రియ సాగింది. కొందరు నిన్ననే కొత్త ఉద్యోగాల్లో చేరగా మిగతావారు ఇవాళ రిపోర్ట్ చేయనున్నారు.
భూసంబంధ లావాదేవీలు, రెవెన్యూ సంబంధిత అంశాల్లో గ్రామ రెవెన్యూ అధికారుల కారణంగా అక్రమాలు జరుగుతున్నాయని, అవినీతికి కారణమవుతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండేళ్ల క్రితం ఆ వ్యవస్థను రద్దు చేసింది. 2020 సెప్టెంబర్‌లో ఉభయసభలు వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లుకు ఆమోదం తెలిపాయి. బిల్లు ప్రవేశపెట్టిన రోజు నుంచే వారిని భూసంబంధిత విధులకు సర్కార్ దూరం పెట్టింది.
సమాన అర్హత స్థాయిలో వీఆర్వోల సేవలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తామని అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వివిధ కారణాలరీత్యా ఆ ప్రక్రియ జరగలేదు. వారంతా రెవెన్యూశాఖలోనే ఉంటూ తహసీల్దార్లు అప్పగించిన బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. భూసంబంధిత పనులు కాకుండా.. ధ్రువపత్రాలు, లబ్ధిదారుల ఎంపిక కోసం పరిశీలన సహా ఇతర విధులు నిర్వర్తించారు.
వీఆర్వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తూ గత నెల 23న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రెవెన్యూ మినహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించింది. జిల్లాలో వివిధ శాఖల్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులను గుర్తించి వీఆర్వోలని లాటరీ ద్వారా కేటాయించాలని ఆదేశించింది. ఒకవేళ జిల్లాలోని పోస్టుల కంటే వీఆర్వోల సంఖ్య ఎక్కువగా ఉంటే మిగిలిన వారిని పొరుగున ఉన్న జిల్లాలో సర్దుబాటు చేయాలని స్పష్టం చేసింది.
ప్రక్రియ మొత్తాన్ని సోమవారం పూర్తి చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా నిన్న అన్ని జిల్లాల్లో ప్రక్రియ పూర్తి చేశారు. లాటరీ ద్వారా వీఆర్వోలను వివిధ శాఖలకు కేటాయించారు. ఆ వెంటనే వారికి కొత్త పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5వేల 294 మంది వీఆర్వోలను రెవెన్యూ మినహా ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేశారు. కొన్ని జిల్లాల్లో రాత్రి వరకు ప్రక్రియ కొనసాగింది. కొంత మంది కొత్త పోస్టింగుల్లో చేరారు. మిగిలిన వారు ఇవాళ ఉదయమే పొస్టింగుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారు వీఆర్వోలుగా కాకుండా ఆయా శాఖల్లోని జూనియర్ అసిస్టెంట్ సమానస్థాయి ఉద్యోగులుగా కొనసాగుతారు.