బీజేపీలో చిత్రమైన వాతవరణం కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఒకపక్క కలలు కంటూనే, పిలుపులు ఇస్తూనే, నాయకులు మాత్రం ఉత్తర దక్షిణ ధ్రువాలుగా మాత్రం ప్రవర్తిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ పగ్గాలను ఆశించి భంగ పడిన సోము వీర్రాజు, ఇప్పుడు బీజేపీ చీఫ్‌గా ఉన్న కన్నా లక్ష్మీనారాయణల మధ్య ఆది నుంచి కూడా విభేదాలు ఉన్నాయి. తన పదవిని కొట్టేశారనే అక్కసు కన్నాపై సోముకు ఉండగా, సోము దూకుడు తన పదవికి ఎక్కడ ఎసరు తెస్తుందోనని కన్నా కూడా ఆందోళనతోనే ఉన్నారు. దీంతో ఇద్దరి మధ్య నేటికీ సఖ్యత కొరవడింది.
ఏపీ రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా కన్నా బాధ్యతలు తీసుకుని దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నాయి. పైగా అత్యంత కీలకమైన ఈ ఏడాది ఎన్నికలు కూడా కన్నా ఆధ్వర్యంలోనే జరిగాయి. అయితే, పార్టీ ఒక్క చోటంటే ఒక్క చోట కూడా పుంజుకోలేదు. దీంతో కన్నాపై పరోక్షంగాను, ఒకింత ప్రత్యక్షంగాను కూడా సోము తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్న నాయకుడిని బీజేపీలోకి ఎందుకు తెచ్చారో తనకు అర్ధం కావడం లేదని బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
ఇలా ఇద్దరూ తలో దిక్కు రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కూడా వీరిద్దరి మధ్య విభేదాలు తెరమీదికి వచ్చాయి. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై కన్నా మండిపడుతున్నారు. ఇసుక సహా తెలుగు మీడియంను ఎత్తేయడంపై ఆయన గళం వినిపిస్తున్నారు. అంతేకాదు, ఏ పార్టీ(గతంలో తిట్టిపోసుకున్న టీడీపీ, జనసేనలు సహా) జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసినా.. ఆందోళనలు చేసినా, నిరసనలు చేపట్టినా తమ పార్టీ మద్దతిస్తుందని కన్నా చెప్పుకొచ్చారు. అంతేకాదు, తెలుగు విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గాలని పిలుపునిచ్చారు.
అయితే, దీనికి ఫుల్లు రివర్స్‌గా సోము వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం మంచిదేనన్నారు. సీఎం జగన్‌ను కలిసిన సోము.. తాజాగా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా కన్నా వ్యాఖ్యలకు భిన్నంగా ఉండడంతో బీజేపీలో ఇదేం రాజకీయం రా బాబూ అనుకునే పరిస్థితి ఏర్పడిందని కమల దళం ఆవేదన వ్యక్తం చేస్తోంది. సో.. ఇదీ ఇద్దరు కీలక నేతల మధ్య బీజేపీలో రాజుకుంటున్న రాజకీయం.