నకిలీ అంతర్జాతీయ కాల్స్, ఎస్ఎంఎస్‌లతో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని టెలికాం సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ టెలికాం విభాగం వారం రోజులుగా వినియోగదారులకు అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఇస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. టెలికాం విభాగం పంపించిన ఈ సందేశంలో.. ‘‘అంతర్జాతీయ కాల్స్ వచ్చినప్పుడు ఫోన్ డిస్‌ప్లేపై ఒక భారతీయ నంబర్ కనిపించడం, లేదా కేవలం ప్రైవేట్ నంబర్ అని చూపించడం, ఫోన్ నంబర్లు కనిపించడకపోవడం వంటివి కనిపించినప్పుడు దయచేసి మాకు సంప్రదించండి.’’ అని ఉంది. వినియోగదారుల సేప్టీని దృష్టిలో పెట్టుకొని 1800 110 420/1963 టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా జారీ చేసింది. నకిలీ కాల్స్‌కు సంబంధించి మోసాలు ఏమైనా జరిగితే ఈ నంబర్‌కు సంప్రదించాలని కోరుతోంది.
నకిలీ కాల్స్ వల్ల అమాయకులను మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో ప్రైవేట్ నంబర్, నకిలీ కాల్స్ వచ్చినప్పుడు టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి టెలికాం విభాగానికి సమాచారం అందజేయాలి. కొన్నేళ్లుగా అంతర్జాతీయ నకిలీ కాల్స్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. తెలియని నంబర్ నుంచి కాల్ చేసి మోసం చేశారని బాధితుల నుంచి ఫిర్యాదులు పెరిగాయి. డబ్బులు ఇప్పిస్తామని.. లాటరి వచ్చిందని.. గిఫ్ట్ వచ్చాయని చెప్పి మోసం చేస్తున్నారు. అందుకే అలాంటి కాల్స్, ఎస్ఎంఎస్ రాకుండా చేయడానికి టెలికాం సంస్థలు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు పైన పేర్కొన్న నంబర్‌కు కాల్ చేసినట్లయితే ఆ నంబర్‌పై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవచ్చన్నారు.
నకిలీ అంతర్జాతీయ కాల్స్ నిర్మూలించేందుకు ఆయా టెలికాం సంస్థలు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ మేరకు ఎయిర్‌టెల్ సంస్థ కూడా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకుంది. తమ చందాదారులు అప్రమత్తంగా ఉండేలా.. తగిన సూచనలు, సలహాలు అందిస్తోంది. బహుమతులు, లాటరీల పేరిట కాల్స్ చేసి మోసం చేస్తున్నారని, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని టెలికాం ఆపరేటర్లు సూచిస్తున్నారు. అంతర్జాతీయ కాల్స్ చేసేటప్పుడు మోసగాళ్లు బహుమతులు, లాటరీలు గెలుచుకున్నారని మొదట్లో ఆశ చూపుతారని, మొదట్లో కమిషన్ పేరిట డబ్బులు వసూలు చేసుకుంటారని టెలికాం ఆపరేటర్లు చెబుతున్నారు. కాల్స్ కంటే ఎక్కువగా ఎస్ఎంఎస్ పంపి మోసం చేసే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు కాల్స్, ఎస్ఎంఎస్‌ను చూసి వినియోగదారులు స్పందించకూడదన్నారు.