హైదరాబాద్: ఉత్తర భారతదేశంలో రుతు పవన ద్రోణి ఏర్పడింది. ప్రస్తుతం ఇది స్థిరంగా కొనసాగుతోంది. దీంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఉపరితల ద్రోణి కారణంగా రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాదు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయని, పలుచోట్ల గంటకు 45 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయని విశాఖ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
అటు తెలంగాణలో కూడా సోమ, మంగళవారాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణం కేంద్రం ప్రకటించింది. ఈ రోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 90 ప్రాంతాల్లో ఆదివారం ఓ మోస్తారు వర్షం కురిసిందని చెప్పారు. ఇక వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.